ప్రస్తుతం ఒక ఊరు, ఒక దేశం కాదు.. యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో వాతావరణ మార్పులే అన్న విషయాన్ని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. పారిశ్రామికీకరణ వల్లే పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతోందని శాస్త్రజ్ఞులు కూడా చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే మనుషులు చేసే కార్యకలాపాలు కూడా దీనికి ఒక కారణమేనని పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. రీసెంటుగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వాతావరణ మార్పులపై మనుషుల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. భూమిపై మనం చేసే పనుల వల్లే సముద్రాలు కూడా వేడెక్కుతున్నాయని నాసా తాజాగా గుర్తించింది. అంతేకాదు దీని వల్ల భవిష్యత్తులో ఇంకా భయంకరమైన మార్పులు రావచ్చొని హెచ్చరించింది.
నాసా వాతావరణ మార్పుల విభాగం ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంటుగా ఓ పోస్ట్ చేసింది. సముద్ర ఉపరితలంపై మనుషుల కార్యకలపాల వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయంపై ఓ గ్రాఫిక్ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆ భౌగోళిక ప్రాంతాల్లో సముద్ర వాతావరణం ఎలా మారుతుందో వివరించింది.
ఈ వీడియోలో చూపించిన దానిని బట్టి చూస్తే కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితల వాతావరణం సాధారణంగానే ఉంది. ఈ విషయాన్ని బ్లూ, గ్రీన్ రంగుల్లో కనిపించగా. . మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సముద్ర ఉపరితలం ఎర్రగా, నారింజ, పసుపు రంగుల్లో కనిపించడాన్ని నాసా వివరించింది. దీనిని బట్టి..ఈ ప్రాంతాల్లో సముద్ర ఉపరితల వాతావరణం వేడిగా ఉన్నట్లు ఈ రంగులు తెలియజేస్తున్నాయి.
నాసా వాతావరణ మార్పుల విభాగం ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘మన సముద్రం మారుతోంది’ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఇప్పుడు సోషల్ మీడియా షేక్ అవుతుంది. నిజానికి భూభాగంలో సుమారు 70 శాతం నీరు ఆక్రమించి ఉండటం వల్ల, భూ వాతావరణంపై సముద్రాలు కీలక పాత్ర పోషిస్తాయన్న విషయం తెలిసిందే. మనుషుల చర్యల వల్ల గ్రీన్‌హౌస్ ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని వల్లే మన కళ్లముందే సముద్రంలో ఇలాంటి మార్పులు జరుగుతున్నాయని నాసా తెలిపింది.అయితే నాసా విడుదల చేసిన ఈ వీడియోతో భవిష్యత్తులో మావవాళికి పెను ప్రమాదం తప్పదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.