ప్రపంచం అంతా ఏకమై పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఉన్నా.. పాక్ మాత్రం తన వంకర బుద్ధిని మార్చుకోదన్న విషయం మరోసారి రుజువయింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ వెనక్కి తీసుకోవడంతో ఉక్రోషంతో రగిలిపోతుంది. తాజాగా భారత్‌పై దాడి చేయడానికి 130 అణుబాంబులను తమ దేశం సిద్ధంగా ఉంచినట్లు పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. వీటితో పాటు ఘోరీ, షహీన్, ఘజ్నవి క్షిపణులు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. భారత్ సింధు జలాలను నిలిపివేస్తే.. పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరిస్తూ తమ వక్రబుద్ధిని మరోసారి బయట పెట్టుకున్నారు.
తమ వద్ద ఉన్న ఆ అణ్వాయుధాలను పాక్‌లోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపర్చామని.. భారత్ కవ్విస్తే మాత్రం దాడికి సిద్ధంగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు. తమ వద్ద ఉన్న ఆయుధాలు, క్షిపణులు ప్రదర్శన కోసం కాదని అన్నారు. అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదన్న ఆయన..తమ బాలిస్టిక్ క్షిపణులు భారత్‌ను లక్ష్యంగా చేసుకొంటాయని అబ్బాసీ బహిరంగ హెచ్చరిక చేశారు. రెండ్రోజులు పాక్ గగనతలం మూసేస్తేనే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో కూరుకుపోయిందన్నారు. మరో 10 రోజులు ఇలానే చేస్తే ఏకంగా భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయని చెప్పారు. అంతేకాదు.. ఇబ్బందులు ఎదుర్కోవడానికి తామూ సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
పాక్ మంత్రులకు ఇలాంటి బెదిరింపులు కొత్త కాదు. అంతకు ముందురోజే పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసీఫ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జమ్మూకశ్మీర్ పహల్గాంలోని బైసరన్‌లో ఉగ్రదాడి తర్వాత ..భారతదేశంతో నెలకొన్న ఉద్రిక్తతలపై పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ, ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం వంటి చెత్త పనులన్ని కూడా పశ్చిమదేశాల కోసమే చేశామని ఓపెన్‌గా అంగీకరించారు. ఇది పొరపాటేనని, ఆ పర్యవసానాలతో తమ దేశమే ఎక్కువ ఇబ్బందులకు గురవుతోందని వాపోయారు.
ఈ ఇంటర్వ్యూలో..ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటివి పాకిస్తాన్ చాలాకాలంగా చేస్తోందని అంటున్నారు. మరి దీనిపై మీ స్పందన ఏంటని జర్నలిస్టు ప్రశ్నించగా.. ఖవాజా బదులిస్తూ.. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు తాము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామన్నారు. అయితే అది పొరబాటని అర్థమైందని.. దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పుకొచ్చారు. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తాము చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉండేదన్నారు. ఆపై 9/11 దాడుల తర్వాత ఇదే పరిస్థితి ఎదురైందని… పాక్‌లోని గత ప్రభుత్వాలు తప్పులు చేశాయని భావిస్తున్నానని చెప్పారు.