దేశంలో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం నాడు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాజా కోవిడ్-19 పరిస్థితులు, ఆరోగ్య వ్యవస్థల సంసిద్ధత, వైద్య ఆక్సిజన్ లభ్యత మరియు కోవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీకి సంబంధించిన అంశాలపై కీలకంగా చర్చించారు. దేశంలో కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో యాక్టీవ్ కేసులు ఎక్కువుగా ఉండడంపై చర్చించారు. కాగా దేశంలో వరుసగా 10వ వారంలో కూడా వీక్లీ పాజిటివిటీ 3% కంటే తక్కువగా ఉన్న విషయాన్ని అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.
కరోనా కొత్త వేరియంట్లను పర్యవేక్షించడానికి నిరంతరం జీనోమ్ సీక్వెన్సింగ్ ఆవశ్యకత గురించి ప్రధాని మోదీ అధికారులకు సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 28 ఇన్సాకాగ్ ల్యాబ్ లు పనిచేస్తున్నాయని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఈ ల్యాబ్ ల నెట్‌వర్క్ హాస్పిటల్ నెట్‌వర్క్ తో కూడా లింక్ చేయబడిందని అధికారులు తెలిపారు. పీడియాట్రిక్ కేర్ కోసం బెడ్ కెపాసిటీని పెంచడం మరియు కోవిడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్యాకేజీ-II కింద సదుపాయాల పెంపుదల స్థితిని ప్రధాని సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ పరిస్థితిని నిర్వహించడానికి ఆ ప్రాంతాలలో ప్రాథమిక సంరక్షణ మరియు బ్లాక్ లెవల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రీడిజైన్ చేయడంపై రాష్ట్రాలకు సూచించబడినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్-19, మ్యూకోర్‌మైకోసిస్, ఎంఐఎస్-సి నిర్వహణలో ఉపయోగించే ఔషధాల కోసం బఫర్ స్టాక్ పెట్టుకోవాలని రాష్ట్రాలను కోరినట్టు తెలిపారు.
ఐసోలేషన్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ మరియు పీడియాట్రిక్ ఐసీయూ, పీడియాట్రిక్ వెంటిలేటర్‌ల పెరుగుదల గురించి ప్రధాని వివరిస్తూ, రాబోయే నెలల్లో గణనీయమైన సంఖ్యలో ఐసీయూ మరియు ఆక్సిజన్ బెడ్స్ మరింతగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ఇక కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో వయోజన జనాభాలో దాదాపు 58% మొదటి డోసు పొందారని, అలాగే వయోజన జనాభాలో 18% మంది రెండవ డోసు పొందారని ప్రధానికి తెలిపారు. వ్యాక్సిన్ పైప్‌లైన్, వ్యాక్సిన్ డోసుల సరఫరా పెంచడం గురించి కూడా వివరించారు. ఈ సమావేశంలో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, హెల్త్ సెక్రటరీ, నీతి ఆయోగ్ హెల్త్ విభాగం సభ్యుడు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ