కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi Inaugurates Kartarpur Corridor, Thanks Imran Khan

ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 9, శనివారం నాడు కర్తార్‌పూర్‌ కారిడార్‌ ను ప్రారంభించారు. దీనితో 550 మంది భారత యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్‌ కర్తార్‌పూర్‌ లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారా సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, గురునానక్‌ 550వ జయంతికి ముందుగానే ఈ కర్తార్‌పూర్‌ కారిడార్‌ను, ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టును తన చేతులతో ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆయన మన ఉద్వేగాలను అర్థం చేసుకుని, భారతీయుల సంప్రదాయాలను గౌరవించారని మోదీ పేర్కొన్నారు.

గురునానక్‌ దేవ్‌జీ భారతదేశంలో పుట్టడం అందరికీ గర్వకారణమని, ఐకమత్యం అనే సందేశాన్ని గురునానక్‌ అందరికీ పంపించారని చెప్పారు. కర్తార్‌పూర్‌ కారిడార్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను సందర్శించడం మరింత సులువైందని, ఈ అవకాశాన్ని ఎక్కువుగా వినియోగించుకోవాలని కోరారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణానికి కృషి చేసిన పంజాబ్‌ ప్రభుత్వం, శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీకి కూడా మోదీ ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పంజాబ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, అకాళీదళ్ నేత సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌తో పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్‌ లోథిలో ఉన్న బేర్ సాహిబ్‌ గురుద్వారాను సందర్శించారు. అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

[subscribe]