ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉక్రెయిన్‌లో మృతి చెందిన విద్యార్థి నవీన్ శేఖరప్ప తండ్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ విపత్కర సమయంలో దేశం మొత్తం వారి కుటుంబానికి అండగా ఉంటుందని ప్రధాని మోదీ భరోసానిచ్చారు. ఈ రోజు ఉక్రెయిన్‌లోని ఒక ప్రభుత్వ భవనాన్ని రష్యా సైనికులు పేల్చివేయడంతో కర్ణాటకలోని హవేరీకి చెందిన వైద్య విద్యార్థి నవీన్ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఉదయం ఖార్కివ్‌లో ప్రభుత్వ భవనాన్ని రష్యా సైనికులు టార్గెట్ చేసుకుని బాంబింగ్ నిర్వహించారు. అయితే, ఆ సమయంలో నవీన్ శేఖరప్ప ప్రభుత్వ భవనం సమీపంలో ఉన్న ఒక సూపర్ మార్కెట్ బయట నిలబడి ఉండగా పేలుడు ధాటికి మృతి చెందాడు.
21 ఏళ్ల ఈ యువకుడి మరణం అతని కుటుంబంతోపాటు యావత్ భారతదేశాన్ని కలచివేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. నవీన్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. అతని కుటుంబం నాకు బాగా తెలుసు. విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటున్నాం అని తెలిపారు. మరోవైపు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా విద్యార్థి మృతికి సంతాపం తెలిపారు “ఈ వార్త వినడానికి భయంగా ఉంది. అతని కుటుంబానికి ప్రార్ధనలు. ఉక్రెయిన్ దేశంలో చిక్కుకుపోయిన ఇతర భారతీయులందరూ త్వరగా ఇంటికి తిరిగి వస్తారని ఆశిస్తున్నాను” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
అలాగే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా నవీన్ మృతిపై తన స్పందన తెలియజేశారు. “ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి నవీన్ ప్రాణాలు కోల్పోయిన విషాద వార్త అందింది. అతని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతి. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులందరి కోసం, మరియు వారి సురక్షితమైన తరలింపు కోసం భారత ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించాలి. ఇలాంటి సమయంలో ప్రతి నిమిషం విలువైనది” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ