కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14, మంగళవారంతో ఈ లాక్‌డౌన్ గడువు ముగియనుండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు(ఏప్రిల్ 14) ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం ఈ రోజు ట్విటర్‌లో వెల్లడించింది. ఈ ప్రసంగంలో లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
కాగా ఏప్రిల్ 11, శనివారం నాడు కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ పొడిగింపుపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ చర్చించారు. ఈ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో పరిస్థితులు, లాక్‌డౌన్ పొడిగింపు అంశంపై తమ అభిప్రాయాల్ని ప్రధాని మోదీకి వివరించారు. తెలంగాణ, తమిళనాడు, బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రధాని మోదీకి తెలియజేసినట్టుగా తెలుస్తుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం, ముఖ్యమంత్రులు సైతం పొడిగింపుకు మొగ్గుచూపడంతో కేంద్రం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు, పంజాబ్ రాష్ట్రం మే 1 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
Prime Minister @narendramodi will address the nation at 10 AM on 14th April 2020.
— PMO India (@PMOIndia) April 13, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

























































