భిన్న సంస్కృతులు, భిన్న మతాలతో దేశ రాజధాని ఢిల్లీకి చారిత్రక వారసత్వం ఉంది. అయితే అలాంటి హస్తిన.. కొంతకాలం నుంచి కాలుష్య కాసారంలాగా మారిపోతోంది. తినే తిండి సంగతి పక్కన పెడితే.. పీల్చే గాలి అత్యంత విషపూరితంగా మారడంతో చిన్నా, పెద్ద నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటి సమయంలో ఇటీవల కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్.. దేశ రాజధానిగా ఢిల్లీ ఉండడం ఎందుకని ప్రశ్నించారు. దేశ రాజధానిగా ఢిల్లీని ఎందుకు కొనసాగించాలంటూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీలో గాలి అత్యంత విషపూరితంగా మారిపోయిందని.. కనీసం అక్కడ ఉండే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి హానికరమన్న విషయం తెలిసిందే కానీ ఇప్పుడు ఢిల్లీలో గాలి పీలిస్తే అంతకు రెట్టింపు హాని శరీరానికి కలుగుతుందంటూ శశిథరూర్ వివరించారు.
శశిథరూర్ చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పు పట్టినా..మెజారిటీ ప్రజలు మాత్రం ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు. దేశ రాజధానిగా ఢిల్లీ ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని తమ వాదనను వినిపించారు. ఎందుకంటే ఢిల్లీలో ప్రస్తుతం కాలుష్యం తారా స్థాయికి చేరింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకారక రాజధానులలో ఢిల్లీ ముందు వరుసలో చేరింది. కొద్దిరోజులుగా అక్కడ హస్తినలో వాతావరణం దారుణంగా ఉండడంతో.. కేంద్ర వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
చివరికి అతిశీ సర్కార్..ఢిల్లీలో కృత్రిమ వర్షాలు కూడా కురిపించడం ప్రారంభించింది. అయినా కూడా అక్కడ కాలుష్యపు స్థాయి తగ్గకపోగా.. మరింత పెరుగుతూ వస్తోందది. మరోవైపు గాలిలో నాణ్యత పూర్తిగా తగ్గిపోవడంతో.. శ్వాస కోశ సంబంధిత వ్యాధుల బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. అత్యవసరమైన పని ఉంటేనే ప్రజలను బయటికి రావాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉండడం ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతుంది.
శశిథరూర్, ఇతర రాజకీయ నాయకులు,ఢిల్లీవాసులు .. హస్తినలో పెరుగుతున్న కాలుష్యం పట్ల ఆందోళనలు వ్యక్తం చేశారు. అయినా కూడా కాలుష్యం నివారణ దిశగా.. ప్రభావంతమైన అడుగులు పడటం లేదన్న వాదన వినిపిస్తోంది.
నిజానికి నవంబర్ నుంచి జనవరి వరకు ఢిల్లీలో కాలుష్యం అనేది సర్వసాధారణంగా మారింది. పొరుగున ఉన్న రాష్ట్రాలలో రైతులు..తమ పంట పొలాల్లో వ్యర్ధాలను తగలబెట్టడం వల్లే..ఇంత విపరీతమైన పొగ ఢిల్లీ నగరాన్ని కమేస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం అక్కడ విపరీతమైన మంచు కురుస్తోంది. దీనివల్ల అక్కడ గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతుంది.
ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా ఉండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కాలుష్యం వల్ల ధూమపానం చేసే వాళ్లు మాత్రమే కాదు.. ఆ అలవాటు లేని వారు కూడా ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. గాలి నాణ్యత తగ్గడం వల్ల వారి ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని.. శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారయితే నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో ఈ కాలుష్యం ఇలాగే కొనసాగితే మాత్రం.. తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి అక్కడి వరకూ రాకముందే ప్రభుత్వం మేలుకోవాలని.. సాధ్యమైనంతవరకు ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు.