తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే మరో రెండు కొత్త వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయాయి. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్లు అనుసంధానత కలిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి 4 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, ఇప్పుడు మరో రైలు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.
నాగ్‌పూర్ -హైదరాబాద్, దుర్గ్ – విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. నాగ్‌పూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుందని చెప్పారు. కాజీపేట, రామగుండం, బల్హార్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్ ేస్టషన్లలో ఈ ఎక్స్‌ప్రెస్ ఆగుతుందని వివరించారు కిషన్ రెడ్డి.
ఇక విశాఖపట్నం-దుర్గ్ (ఛత్తీ్‌సగఢ్) మధ్య మరో వందే భారత్ రైలు సేవలు అందిస్తుందని తెలిపారు. రాయ్‌పూర్, మహాసముంద్, ఖరియార్ రోడ్, కాంతబంజి, తిత్లాగఢ్, కేసింగా, రాయగడ, విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని తెలిపారు. ఈ రెండు రైళ్లను ఈ నెల 16న అహ్మదాబాద్ నుంచి ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. ఆ రోజు ప్రధాని దేశవ్యాప్తంగా 10 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారని వివరించారు.
తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ రైళ్లను కేటాయించిన ప్రధాని మోదీకి కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇప్పటివరకు నడుస్తున్న వందేభారత్ రైళ్లు 8నుంచి 16 బోగీలతో ఉండగా.. సికింద్రాబాద్ – నాగ్‌పూర్ వందేభారత్ 20 బోగీలతో నడవనుంది.