భారత చరిత్రలో చీకటి రోజు..పుల్వామా ఆత్మాహుతి దాడి ఘటన. పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడిలో ఏకంగా 40 మంది భారతదేశపు సైనికులు అమరులవగా..చాలా మంది వరకూ గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్ 54 బెటాలియన్‌కు చెందిన భారత సైనికులు శ్రీనగర్‌కు కాన్వాయ్ లో బయలుదేరి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. శక్తివంతమైన ఐఈడీలతో వచ్చిన ముష్కరుడు.. వాహనాన్ని ఢీకొట్టడంతో.. పేలుడు ధాటికి బస్సు ధ్వంసమైంది. అనేక వాహనాలు దెబ్బతిని సైనికులు చెల్లాచెదురుగా పడిపోయారు. దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. పక్కా వ్యూహంతోనే సైనిక కాన్వాయ్‌పై పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్.. తన వాహనాన్ని నేషనల్ హైవేపై కల్వర్టు పక్క నుంచి సైనికుల వాహన శ్రేణిలోకి ఎడమవైపు నుంచి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు.
సైనిక కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్.. మొదటి బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుంచి ఐదో వాహనాన్ని ఢీకొట్టడానికి స్థానిక యువకులు సహకరించినట్లు కూడా దర్యాప్తులో తేలింది. దాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు రువ్వగా.. ఈ సమయంలో పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకొంటూ వచ్చిన ముష్కరుడు.. సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిలోని ఐదో బస్సును ఢీకొట్టాడు.ఈ దాడికి అనువైన ప్రాంతాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారు. శ్రీనగర్ నేషనల్ హైవేలో లెత్‌పోరా వద్ద రోడ్డు వాలుగా ఉండటంతో..అక్కడ వాహనాలు నెమ్మదిగా కదులుతాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ఆ ప్రదేశంలో మెల్లగా వెళ్తుందని, సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో .. 78 వాహనాలతో పాటు వెళ్లే కాన్వాయ్‌లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగింది.
సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి తర్వాత భారత సైన్యం ప్రతీకారంతో రగిలిపోయింది. వెంటనే జమ్మూ కశ్మీర్‌లో సైనికులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 10 మందికి పైగా పాక్ మిలిటెంట్లు హతమయ్యారు. పుల్వామా ఘటన తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు తగిన శాస్తి చెప్పాలని భావించిన భారత్..దానికి మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌ను ఎంచుకుంది. 2019 ఫిబ్రవరి 26న సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వైమానిక దళం విమానాలు..బాలాకోట్‌లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై వరుస బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ స్ట్రయిక్స్‌లో 300 మంది వరకూ ఉగ్రవాదులు హతమైనట్టు నిఘా వర్గాలు నివేదించారు. 40 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే మొదటిసారి.