రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: సచిన్ పైలట్ కు కాంగ్రెస్ ఉద్వాసన, డిప్యూటీ సీఎంగా తొలగింపు

Ashok Gehlot vs Sachin Pilot, Deputy Chief Minister of Rajasthan, Rajasthan Crisis, Rajasthan Government Turmoil, Rajasthan political crisis, Rajasthan political crisis news, Rajasthan Political News, Sachin Pilot, Sachin Pilot Latest News, Sachin Pilot Removed From Deputy CM Post, Sachin Pilot Turmoil With Ashok Gehlot And INC

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తిరుగుబాటుతో రాజస్థాన్‌ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ‌తో కలిసి పనిచేయడానికి సచిన్‌ పైలట్ విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, అహ్మద్‌ పటేల్‌ సహా పలువురు నాయకులు సచిన్‌ పైలట్‌తో మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. అయినా కూడా ప్రస్తుత పరిణామాల్లో ఎలాంటి మార్పు రాలేదు. అలాగే ఈ రోజు జైపూర్ లో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభాపక్షం రెండోసారి సమావేశానికి కూడా సచిన్ పైలట్ వర్గం హాజరు కాలేదు. సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో రాజస్థాన్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు జైపూర్ రిసార్ట్ లో ఉండగా, సచిన్ వర్గం ఎమ్మెల్యేలు హర్యానాలోని ఓ రిసార్ట్ లో ఉన్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో తిరుగుబాటు పరిస్థితుల దృష్ట్యా సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణా చర్యలకు దిగింది. ఉపముఖ్యమంత్రి పదవి నుంచి, పార్టీ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కూడా ఆయనను తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రెండుసార్లు శాసనసభాపక్షం సమావేశానికి హాజరు కావాలని పిలిచినా సచిన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. సచిన్ తో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా షోకాజ్ నోటీసులు పంపించాలని పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు సచిన్ పై కాంగ్రెస్ చర్యలు అనంతరం బీజేపీ స్పందించింది. సచిన్‌ పైలట్‌ను బీజేపీ లోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఆ పార్టీ నేత ఓం మథూర్‌ ప్రకటించారు. బీజేపీ విధివిధానాలు నచ్చితే ఎవరైనా తమ పార్టీలోకి రావొచ్చని ఓం మథూర్‌ పేర్కొన్నారు. రాజస్థాన్‌ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu