రోష్ని నాడర్ మల్హోత్రా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కుమార్తె, ఆసియాలోనే అత్యంత ధనిక వ్యాపారవేత్తగా అవతరించారు. ఆమెకు ఈ ఘనత తన తండ్రి బహుమతిగా ఇచ్చిన 47 శాతం వాటా వల్ల లభించింది. ఈ బహుమతితో, రోష్ని నాడర్ నికర విలువ ణనీయంగా పెరిగి, ప్రపంచంలోని ధనిక మహిళల జాబితాలో 5వ స్థానాన్ని దక్కించుకున్నారు.
అతిపెద్ద వాటాదారుగా రోష్ని నాడర్
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ డేటా ప్రకారం, శివ్ నాడార్ తన 47% వాటాను కుమార్తెకు బహుమతిగా ఇచ్చిన తర్వాత, ఆమె హెచ్‌సిఎల్ గ్రూప్‌లో అతిపెద్ద వాటాదారుగా మారారు. భారతదేశంలో మూడవ ధనవంతురాలిగా మాత్రమే కాకుండా, ఆసియాలో అత్యంత ధనిక వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.
హెచ్‌సిఎల్ గ్రూప్‌లో నియంత్రణ
వారసత్వ ప్రణాళికలో భాగంగా, శివ్ నాడార్ హెచ్‌సిఎల్ కార్పొరేషన్, వామా ఢిల్లీ వంటి ప్రమోటర్ సంస్థలలో తన వాటాను రోష్ని నాడర్‌కు బహుమతిగా అందజేశారు. ఈ బదిలీతో, ఆమె హెచ్‌సిఎల్ ఇన్ఫోసిస్టమ్స్, హెచ్‌సిఎల్ టెక్ కంపెనీలలో మెజారిటీ నియంత్రణను సాధించారు. ప్రస్తుతానికి, రెండు సంస్థల్లో ఆమె వాటా 57%కు పైగా పెరిగింది.
భారతదేశంలో అంబానీ, అదానీ తర్వాత రోష్ని
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ముఖేష్ అంబానీ ($88.1 బిలియన్) భారతదేశంలోనే కాకుండా ఆసియాలో అత్యంత ధనవంతుడు. ఆయన తర్వాత గౌతమ్ అదానీ ($68.9 బిలియన్) ఉన్నారు. శివ్ నాడార్ తన వాటాను రోష్ని నాడర్‌కు బదిలీ చేయడానికి ముందు మూడవ స్థానంలో ($35.9 బిలియన్) ఉండగా, ఇప్పుడు ఈ స్థానం రోష్ని సొంతమైంది.
విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీని అధిగమించిన రోష్ని
హోల్డింగ్ విలువ పరంగా, రోష్ని నాడర్ విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీని మించిపోయారు. ఆమె హెచ్‌సిఎల్ టెక్‌లో రూ.2.57 లక్షల కోట్లకు పైగా వాటాను కలిగి ఉండగా, అజీమ్ ప్రేమ్‌జీ రూ.2.19 లక్షల కోట్ల వాటాను కలిగి ఉన్నారు. రోష్ని నాడర్ మల్హోత్రా నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబిఏ పూర్తి చేశారు. 2020 నుంచి హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.