ఉక్రెయిన్ పై గురువారం నాడు రష్యా యుద్ధం ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో సైనిక చర్యను (మిలిటరీ ఆపరేషన్) ప్రకటించారు. వ్లాదిమిర్ పుతిన్ టీవీలో ప్రకటన చేస్తూ, ఉక్రెయిన్ నుండి వస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా, ఆత్మరక్షణ కోసమే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనే లక్ష్యం రష్యాకు లేదన్నారు. ఉక్రెయిన్ పై రష్యా తీసుకున్న ఈ చర్యపై ఇతర ప్రపంచ దేశాలు ఏవైనా జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే వారు ఎన్నడూ చూడని తీవ్ర పరిణామాలకు గురికావాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరిక జారీ చేశారు. రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కైవ్ మరియు మరో ముఖ్య నగరమైన ఖార్కివ్ లు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. అయితే జనావాసాలపై దాడులు చేయడం లేదని, సైనిక స్థావరాలు, వాయుసేన, ఇతర కీలక వసతుల మీదనే దాడులు చేస్తునట్టు రష్యా ప్రకటించింది.
మా దేశాన్ని కాపాడుకుంటాం : ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ
మరోవైపు రష్యా నిర్ణయంతో ఉక్రెయిన్ అప్రమత్తమైంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ గురువారం యుద్ధ చట్టాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు. రష్యా సైనిక దాడులను ప్రారంభించినందున భయపడవద్దని ఆయన ఉక్రెయిన్ పౌరులను కోరారు. తమ దేశాన్ని కాపాడుకుంటామని ప్రకటించారు. అలాగే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ఉక్రెయిన్ తనను తాను రక్షించుకుని గెలుస్తుందన్నారు. రష్యా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించిందని, శాంతియుతంగా ఉండే ఉక్రెయిన్ నగరాలు నేడు స్ట్రైక్స్ కు గురవుతున్నాయన్నారు. ప్రపంచ దేశాలు ఈ చర్యను ఆపాలని, ఆ సమయం వచ్చిందని అన్నారు. రష్యాపై వేగవంతమైన ఆంక్షలు విధించాలని, ఉక్రెయిన్ కోసం ఆయుధాలు, పరికరాలు, ఆర్థిక మరియు మానవతా సహాయం అందించాలన్నారు.
ఇక ఉక్రెయిన్‌పై యుద్దాన్ని ఆపాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పుతిన్ ను కోరారు. రష్యా బలగాలను ఉక్రెయిన్ నుంచి వెంటనే వెనక్కు పిలిపించాలన్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా రష్యా చర్యపై తీవ్రంగా స్పందించారు. రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రార్దిస్తున్నామని చెప్పారు. అలాగే యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ స్పందిస్తూ, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడికి యూకే మరియు దాని మిత్రదేశాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై ఈ అసంకల్పిత దాడిని ప్రారంభించడం ద్వారా రక్తపాతం మరియు విధ్వంసం యొక్క మార్గాన్ని ఎంచుకున్నారని, దీనిపై మిత్ర దేశాలతో కలిసి నిర్ణయాత్మకంగా స్పందిస్తామని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ