దేశంలోని అన్ని యూనివర్సిటీలను సెప్టెంబర్ చివరి కల్లా తప్పనిసరిగా డిగ్రీ, పీజీ ఇతర కోర్సుల చివరి సంవత్సరం/ సెమిస్టరు పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి సమయంలో పరీక్షల నిర్వహణ అంశంలో యూజీసీ మార్గదర్శకాలపై పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. కాగా మంగళవారం నాడు ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. యూనివర్సిటీల పరీక్షలను రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని, పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేసి డిగ్రీలు ప్రధానం చేసేలా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోకూడదని యూజీసీ కోర్టుకు వివరించింది. పరీక్షలపై తమ మార్గదర్శకాలను రాష్ట్ర అథారిటీలు ఉల్లంఘించలేవని, పరీక్షలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాలని యూజీసీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు.
మరోవైపు పరీక్షల నిర్వహణలో సెప్టెంబర్ 30 గడువును పొడిగింపు కోసం రాష్ట్రాలు విజ్ణప్తి చేసుకోవచ్చని యూజీసీ కోర్టుకు తెలిపింది. కాగా పరీక్షలు నిర్వహించకపోవడం వలన ప్రమాణాలు పతనం కావడం అంటూ ఉండదని, కొన్ని ఐఐటిలు సైతం పరీక్షలు లేకుండా డిగ్రీలు ఇస్తామని ప్రకటించాయని రాష్ట్రాల తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. అలాగే 3 రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరాలను సమర్పించాలని ఈ విచారణకు సంబంధించిన అందరికి కోర్టు సూచించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu