నిరుపేదలకు సబ్సిడీ: తక్కువ ధరకు గోధుమ పిండి, బియ్యం

Subsidy for the Poor: Wheat Flour and Rice at Lower Prices

భారత్ బ్రాండ్ రిటైల్ విక్రయాల రెండో దశ ప్రారంభమైంది. ప్రస్తుతం గోధుమ పిండి, బియ్యం సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్నారు. జొన్నలు, శనగలు కూడా విక్రయించే యోచనలో ఉన్నారు. అక్టోబర్ 2023 నుండి జూన్ 2024 వరకు మొదటి దశలో విక్రయాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరోమారు నిత్యావసర ఆహార పదార్థాల ధరల పెరుగుదలను నివారించేందుకు ప్రభుత్వం భారత్ బ్రాండ్‌తో రిటైల్ పథకాన్ని పునఃప్రారంభించింది.

ఈ రెండో దశలో ప్రభుత్వం గోధుమ పిండి, బియ్యం వంటి ఆహార పదార్థాలను విక్రయిస్తోంది. గోధుమ పిండి ప్యాకెట్లు కిలో రూ.30కి ఐదు ప్యాకెట్లు అందిచనున్నారు. అలాగే కిలో రూ.34 చొప్పున 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం ధర రూ.55 నుంచి రూ.60 పలుకుతోంది. గోధుమ పిండి రూ.45-50, శనగలు రూ.90-100, మినపప్పు రూ.120-130. ప్రభుత్వ సబ్సిడీ కింద బియ్యం రూ.34, గోధుమపిండి రూ.30, శనగలు రూ.70, శనగలు రూ.107కు విక్రయించనున్నారు.

మొదటి దశలో, సుమారు 15.20 లక్షల మెట్రిక్ టన్నుల భారత్ గోధుమ పిండి, 14.58 లక్షల మెట్రిక్ టన్నుల భారత్ బియ్యం సాధారణ వినియోగదారులకు సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉంచబడ్డాయి. రెండో దశలో 3.69 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలు, 2.91 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని రిటైల్‌ విక్రయానికి అందుబాటులో ఉంచారు. ఇవి అయిపోయే వరకు సబ్సిడీ ధరలతో విక్రయం కొనసాగుతుంది. ఆ తర్వాత అవసరమైతే మరింత గోధుమలు మరియు బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది.

భారత్ బ్రాండ్ పథకం అనేది వినియోగదారుల సౌకర్యార్థం చేపట్టిన తాత్కాలిక పథకం అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. వీటిని వివిధ ప్రభుత్వ ఆహార విక్రయ కేంద్రాలైన NCCF, NAFED మరియు ఇ-కామర్స్/బిగ్ చైన్ రిటైలర్ల దుకాణాలు మరియు మొబైల్ వ్యాన్‌లలో సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్నారు.