టీ20 ప్రపంచ కప్-2022 లో భారత్ జట్టు మూడో విజయాన్ని నమోదు చేయడంతో సెమీఫైనల్‌లోకి వెళ్లేందుకు మరింత చేరువైంది. నవంబర్ 2, బుధవారం మధ్యాహ్నం సూపర్-12లో భాగంగా అడిలైడ్ ఓవల్ స్టేడియంలో బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా డీఎల్ఎస్ మెథడ్ ప్రకారం సెకండ్ ఇన్నింగ్స్ ను (బంగ్లాదేశ్) ను 16 ఓవర్లకు 151 పరుగులు టార్గెట్ గా నిర్ణయించడంతో బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా పోరులో 5 పరుగుల తేడాతో భారత్ విజయం దక్కించుకుంది. దీంతో సూపర్-12 గ్రూప్-2 లో ఇప్పటికి 6 పాయింట్స్ తో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ పై మ్యాచ్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ అర్థ సెంచరీలతో రాణించారు.
ముందుగా టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 184 పరుగుల చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (2) పరుగులకే వెనుదిరగగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సులు), విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) తో రాణించారు, వీరిద్దరూ 36 బంతుల్లో 67 పరుగులు జోడించారు. అలాగే విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 30; 4 ఫోర్లు)తో కలిసి 25 బంతుల్లో 38 పరుగులు జోడించడంతో భారత్ 184 పరుగులు సాధించింది. గత కొన్ని మ్యాచ్ లలో ఫామ్ తో ఇబ్బంది పడుతున్న రాహుల్ బంగ్లాదేశ్ పై కళ్లుచెదిరే షాట్లతో క్రీడాభిమానులను అలరించాడు. అయితే భారీ ఇన్నింగ్ దిశగా వెళ్లాడని భావించగా, అర్ద సెంచరీ పూర్తిచేసిన అనంతరం తదుపరి బంతికే రాహుల్ పెవిలియన్ చేరాడు. ఓవైపు వికెట్లు పడుతున్న విరాట్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి, జట్టు 184 పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్యా (5), దినేష్ కార్తీక్ (7), అక్షర్ పటేల్ (7), అశ్విన్ (13 నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హాసన్ మహమూద్ (3/47), షకీబ్ అల్ హాసన్ (2/33) వికెట్లు తీశారు.
అనంతరం 185 పరుగుల లక్ష్యఛేదనకై బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. బంగ్లా ఓపెనర్ లిట్టన్ దాస్ భారత్ బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటు పరుగులు సాధించాడు. కేవలం 21 బంతుల్లో లిట్టన్ దాస్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో 7 ఓవర్లు పూర్తయి 66 పరుగులు చేసిన సమయంలో (లిట్టన్ దాస్ 59, నజముల్ హెస్సేన్ శాంటో 7 పరుగులతో ఉండగా) వర్షం కురవడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. కొంత సమయం అనంతరం డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం మ్యాచ్ ను 16 ఓవర్లకు కుదిస్తూ, బంగ్లాదేశ్ టార్గెట్ ను 151 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు.
అనంతరం అశ్విన్ వేసిన 8 ఓవర్లో రెండో బంతికే లిట్టన్ దాస్ రనౌట్ అయి వెనుదిరిగాడు. అలాగే మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ బ్యాటర్స్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. నజముల్ హెస్సేన్ శాంటో (21), కెప్టెన్ షకీబ్ అల్ హాసన్ (13), అఫిఫ్ హెస్సేన్ (3), యాసిర్ అలీ(1), మొసాదిక్ హెస్సేన్ (6) పరుగులు మాత్రమే చేశారు. ఆఖర్లో తస్కిన్ (12), నురుల్ హసన్ (14 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎదురుదాడి చేసినప్పటికీ బంగ్లాకు విజయం అందించలేకపోయారు. భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (2/38), హార్దిక్ పాండ్యా (2/28), మహమ్మద్ షమీ (1/25) వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేయడంతో భారత్ ఖాతాలో మరో విజయం చేరింది.
ఈ మ్యాచ్ లో 64 పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ ఖాతాలోకి మరో ఘనత చేరింది. 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు టీ20 ప్రపంచ కప్ టోర్నమెంటులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. గతంలో ఈ రికార్డ్ మహేల జయవర్ధనే (1016) పేరుపై ఉండగా, తాజా మ్యాచ్ తో విరాట్ కోహ్లీ సొంతమైంది. ఇక టీ20 ప్రపంచ కప్ భాగంగా నవంబర్ 6న మధ్యాహ్నం 1:30 గంటల నుంచి భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE