స్టాక్ మార్కెట్లు వారంలో 5 రోజులు మాత్రమే ట్రేడింగ్ సాగిస్తూ ఉంటాయి.వారంలో శని, ఆదివారాలే కాకుండా ఇంకా పబ్లిక్ హాలిడేస్, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా సెన్సెక్స్, నిఫ్టీ మూసివేసి ఉంటాయి. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 1 శనివారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉంటుందా ఉండదా అన్న ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది.
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 రోజులు ట్రేడింగ్ ఉంటుంది. అలాగే కొన్ని పబ్లిక్ హాలిడేస్ సహా BSE, NSE మెయిన్ ఆఫీసులు ఉండే ముంబైలో ఎన్నికలు, ఇతర ముఖ్య పండగలు ఏమైనా ఉంటే అప్పుడు కూడా స్టాక్ మార్కెట్ హాలిడే ఉంటుంది. ప్రతి ఏడాది ఆరంభంలోనే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి.. ఆ సంవత్సరానికి సంబంధించి హాలిడేస్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తుంటుంది.
కాగా..ఈ బడ్జెట్ రోజు శనివారం అయినా కూడా ఎప్పటిలానే సాధారణ టైమింగ్స్‌తోనే స్పెషల్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నట్లు ఎన్ఎస్ఈ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ సెషన్ ఉదయం 9.15 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు సాగనుంది. దీనికి ముందు కూడా ఇలా బడ్జెట్ రోజు శనివారం అయినా కూడా.. రెండు సార్లు ట్రేడింగ్ జరిగింది. 2020, ఫిబ్రవరి 1న; 2015 ఫిబ్రవరి 28న బడ్జెట్ శనివారం ప్రవేశపెట్టారు.
బ్లాక్ డీల్ మీటింగ్ ఫిబ్రవరి 1 ఉదయం 8గంటల45 నిమిషాల నుంచి 9 గంటల వరకు కొనసాగనుంది. స్పెషల్ ప్రీఓపెన్ సెషన్ ఐపీఓ, రీలిస్టెడ్ సెక్యూరిటీల కోసం ఉదయం 9 గంటల నుంచి 9గంటల45 నిమిషాల వరకు ఉండనుంది. కాల్ ఆక్షన్ ఇల్లిక్విడ్ సెషన్ అంటే గంట చొప్పున 6 సెషన్లు.. 9.30 నుంచి 3.30 వరకు ఉంటుంది. బ్లాక్ డీల్ సెషన్- 2 మధ్యాహ్నం 2గంటల 05 నిమిషాల నుంచి 2గంటల20 నిమిషాల వరకు సాగనుంది. పోస్ట్ క్లోజింగ్ సెషన్ 3.40 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. ట్రేడ్ మాడిఫికేషన్ కటాఫ్ టైమ్ 4గంటల15 నిమిషాలుగా నిర్ణయించింది.
కేంద్ర బడ్జెట్ అతిపెద్ద ఈవెంట్లలో ఒకటి.. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా రాబోయే ఏడాది కాలానికి సంబంధించి ఆదాయ, వ్యయాల లెక్కల్ని ఈ బడ్జెట్ వెలువరిస్తుంటుంది. ఆయా రంగాలకు కేంద్రం కేటాయింపుల్ని బట్టి.. చేసే ప్రకటనల్ని బట్టి.. హెచ్చుతగ్గులు ఉండటంతో.. తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతుంటాయి. ఇది స్టాక్ మార్కెట్లపై చూపే ఈ ప్రభావాన్ని ఇంట్రాడే ట్రేడర్స్ క్యాష్ చేసుకోవాలని చూస్తారు. గతేడాది 2024, జులై 23న మధ్యంతర బడ్జెట్ సమయంలో ..ఒడుదొడుకుల్లో ట్రేడయి చివరకు సెన్సెక్స్ 70 పాయింట్లు పడిపోగా.. నిఫ్టీ 30 పాయింట్లు తగ్గింది.