గ్రీన్ కార్డు అనగానే అమెరికా పౌరసత్వం, అమెరికాలో శాశ్వత నివాసం గుర్తుకు వస్తుంది. దశాబ్దాలుగా ఈ విధానం కొనసాగుతున్నా.. ట్రంప్ 2.0 పాలనలో మాత్రం గ్రీన్‌కార్డు అర్థం మారిపోయింది. గ్రీన్‌కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం ఉండదని ప్రకటించడమే కాదు.. వాటిస్థానంలో ట్రంప్ కార్డులు కూడా తెచ్చింది అక్కడి ప్రభుత్వం.
అమెరికాలో గత జో బైడెన్ ప్రభుత్వం అనుసరించిన ఉదార ఇమిగ్రేషన్ విధానాలను ఆసరాగా చేసుకుని శాశ్వత నివాస హోదా పొందిన విదేశీయులకు..ప్రస్తుతం గ్రీన్‌కార్డ్ జారీ ప్రక్రియ హఠాత్తుగా నిలిపివేశారు. ఈ ప్రక్రియను టెంపరరీగా నిలిపివేసినట్లు అమెరికా పౌరసత్వ విభాగం ధ్రువీకరించింది. మరోవైపు ఇప్పటికే అక్రమ మార్గాల్లో అమెరికాలోకి ప్రవేశించి శాశ్వత నివాస హోదా సంపాదించిన లక్షలాది మంది భవిష్యత్తు ఇప్పుడు అయోమయంలో పడింది. గ్రీన్ హోల్డర్స్ పొందిన గత చరిత్రను ఇప్పుడు మరోసారి సమీక్షించి, వారి విషయంలో అవకతవకలు జరిగాయా అని పరిశీలించాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది.
దీనిలో భాగంగా ట్రంప్ యంత్రాంగం గ్రీన్ హోల్డర్స్ పాత రికార్డులన్నీ తిరగేసి..గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించబోతోంది. దీంతో వారంతా అమెరికాలో కానీ, వారి స్వదేశంలో కానీ హింస, పీడనలకు గురయ్యారా లేక వీసా విధానాలను దుర్వినియోగం చేశారా అనేది తేల్చాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇది ఇక్కడితో ఆగుతుందా లేక మరిన్ని మతలబులు పెట్టి అమెరికా నుంచి వెళ్లగొడుతుందా అంటూ భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి కారణం గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌తో పాటు, గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్నవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. 2018లో 8 వేలమంది దరఖాస్తు చేసుకోగా.. 2023లో 51,000 మందికి పైగా భారతీయులు అమెరికాలో శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది 2018తో పోలిస్తే 466 శాతం ఎక్కువని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి.