41 దేశాలకు షాకివ్వబోతున్న ట్రంప్..!

Trump Is Going To Shock 41 Countries, Trump Is Going To Shock, 41 Countries, Cuba, Iran, North Korea Afghanistan, Pakistan, Syria, US President Donald Trump, Donald Trump, National News, International News, Live Updates, Breaking News, Live News, Mango News, Mango News Telugu

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఏకంగా 41 దేశాలపై కఠినమైన ఆంక్షలు విధించడానికి ట్రంప్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. డజన్ల కొద్దీ దేశాల పౌరులపై ప్రయాణ నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు వార్త సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఈ మేరకు అంతర్గత మెమో కూడా సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ఈ మెమోరాండంలో 41 దేశాల జాబితా ఉందని.. వీటిని మూడు వేర్వేరు గ్రూపులుగా విభజించినట్లు వార్తలు వినిపించగా… ఈ జాబితాలో పాకిస్తాన్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

41 దేశాలలోని జాబితాలో మొదటి గ్రూపులో 10 దేశాలు ఉండగా.. ఉత్తర కొరియా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా ఉన్నట్లు సమాచారం. ఈ దేశాల పౌరులకు అమెరికా వీసాలు పూర్తిగా నిషేధించనున్నారు. ఈ 10 దేశాలకు సంబంధించిన వ్యక్తులెవరైనా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో అడుగు కూడా పెట్టలేరు. రెండవ గ్రూపులో ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ దేశాలుండగా… ఈ దేశాలు పాక్షిక సస్పెన్షన్‌ను ఎదుర్కొంటాయి. అంటే ఈ నిషేదం పర్యాటక, విద్యార్థి వీసాలతో పాటు ఇతర వలస వీసాలను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మినహాయింపులుంటాయి.

ఇక మూడవ గ్రూపులో బెలారస్, పాకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్ వంటి దేశాలతో పాటు సహా 26 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పౌరులకు వీసాలు జారీ చేసే అంశంలో పాక్షిక నిషేధం ఉంటుంది. ఈ దేశాలకు 60 రోజుల్లోపు భద్రతా లోపాలను తొలగించే అవకాశాన్ని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ జాబితాలో మార్పులు, చేర్పులు సాధ్యమేనని సమాచారం. దీని ప్రకారం ఆ 41 దేశాల జాబితాలో మరి కొన్ని కొత్త దేశాలను జోడించవచ్చని, కొన్ని దేశాలను తొలగించవచ్చని తెలుస్తోంది.

నిజానికి ట్రంప్ తన మొదటి పదవీకాలంలోనే ఏడు ముస్లిం-మెజారిటీ దేశాల పౌరులపై ప్రయాణ నిషేధాన్ని విధించారు. దీనిని 2018లో సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత జనవరి 20న ఒక కార్యనిర్వాహక ఉత్తర్వువులను జారీ చేశారు. ఇకపై అమెరికాలోకి ప్రవేశించాలనుకునే విదేశీ పౌరుల సేఫ్టీ చెకప్‌లను మరింత కఠినతరం చేయాలని ట్రంప్ ఆదేశించారు. తాజాగా మరో 41 దేశాలకు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.