దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35 వేల మార్క్‌ను దాటింది. ఇక గడచిన 24 గంటల వ్యవధిలో 14 మంది మృతి చెందగా.. కరోనా కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 5,30,979కి చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖల మంత్రులతో ఇప్పటికే కీలక సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో నేడు, రేపు రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. ఇక ఈ మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం హర్యానాలోని ఝజ్జర్‌లో గల ఎయిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్-19 పాజిటివ్ కేసులు గతంలోలా ఒక్కసారిగా పెరిగిన తర్వాత ఇబ్బందులు పడకుండా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని, ఈ మేరకు ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. దీనికోసం రాష్ట్రాల పరిధిలో జీనోమ్ సీక్వెన్సింగ్ సామర్థ్యం పెంచడంపై దృష్టి సారించాలని అన్ని రాష్ట్రాలను కోరారు. తద్వారా టీకాల లభ్యత, ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, టెక్నీషియన్లు, ఐసోలేషన్, పడకల సామర్థ్యం, ఆక్సిజన్ వసతి, వెంటిలేటర్ సౌకర్యం, ఐసీయూ బెడ్‌ల వివరాలతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు, ఆర్టీపీసీఆర్ పరీక్షలు, కిట్ల లభ్యత, పీపీఈ కిట్లు, ఆక్సీమీటర్‌లు, మాస్కులు వంటి కీలక అంశాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా మరోవైపు కరోనా కేసులలో పెరుగుదల కనిపిస్తున్న నేపథ్యంలో.. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. జన సమ్మర్థ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హర్యానా, పుదుచ్చేరి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇక గర్భిణులు, వ్యాధిగ్రస్థులు, వృద్ధులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, అలాగే తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచాలని కూడా ప్రైవేటు ఆస్పత్రులకు కేరళ సర్కారు స్పష్టం చేసింది. అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులకు కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE