అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తును వేగవంతం చేసే లక్ష్యంతో భారత్ పోల్ పేరుతో ఒక పోర్టల్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఏజెన్సీలు వేగవంతంగా అంతర్జాతీయ పోలీసుల సహకారం తీసుకునేందుకు సీబీఐ సహకారంతో దీనిని అభివృద్ధి చేశారు. దర్యాప్తు సంస్థలు ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకుని పరారీలో ఉన్న నేరగాళ్లను అదుపులోకి తీసుకునేందుకు భారత్ పోల్ పోర్టల్ ఉపకరిస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలు ఇంటర్ పోల్‌తో సులువుగా కనెక్ట్ అయ్యేందుకు భారత్ పోల్ అవకాశం కల్పిస్తుంది. ఇప్పటివరకు ఇంటర్ పోల్‌తో భారతదేశం తరఫున సీబీఐ మాత్రమే సమన్వయం చేసుకునేది. ఇకపై భారత్ పోల్ పోర్టల్ ద్వారా దేశానికి చెందిన ప్రతి దర్యాప్తు సంస్థ, అన్ని రాష్ట్రాల పోలీసులు నేరుగా ఇంటర్ పోల్‌తో సంప్రదించవచ్చు.
భారత్ పోల్ పోర్టల్ ద్వారా మన దేశంలోని దర్యాప్తు సంస్థల మధ్య సమాచార మార్పిడి వేగంగా జరుగుతుంది. విదేశీ దర్యాప్తు సంస్థలతో భారత దర్యాప్తు సంస్థల సమన్వయం, సమాచార మార్పిడి వేగవంతమవుతాయి. కేసులను త్వరగా పరిష్కరించాలంటే దర్యాప్తు విభాగాల సత్వర స్పందన, సమన్వయం అత్యవసరం. అంతర్జాతీయ స్థాయిని కలిగిన కేసుల్లోనూ ఇది కీలకం. ఈ లోటును ఇక నుంచి భారత్ పోల్ పోర్టల్ తీర్చనున్నది.
వివిధ కేసులకు సంబంధించి విదేశాల్లో ఉన్న నిందితులు, నేరగాళ్ల వివరాలను భారత్ పోల్ పోర్టల్ వేదికగా ఇంటర్‌పోల్, వివిధ దేశాల దర్యాప్తు సంస్థలకు పంపవచ్చు. రెడ్ కార్నర్ నోటీసుల అంశంపై సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు ఇచ్చిపుచ్చుకోవచ్చు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల దర్యాప్తు సంస్థలు పరస్పర సమన్వయం కోసం భారత్ పోల్ పోర్టల్‌ను వాడుకుంటాయి. అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా దీన్ని వేదికగా చేసుకుని కమ్యూనికేషన్ చేసుకుంటాయి.