అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ , బుచ్ విల్‌మోర్ భూమికి తిరిగి రావడానికి వచ్చే ఏడాది వరకు ఆగాల్సి వస్తుంది. జూన్ 5న వీరిని తీసుకెళ్లిన స్టార్‌లైనర్ ప్రొపల్షన్ వ్యవస్థలో తీవ్ర సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎక్కువ రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె స్పేస్ ఎనీమియా బారిన పడే ముప్పు ఉందంటున్నారు.
అంతరిక్షంలో ఉన్న సమయంలో వ్యోమగాముల్లో ఎర్రరక్తకణాలు క్షీణించే స్థితినే స్పేస్ ఎనీమియా అంటారు. మైక్రో-గ్రావిటీకి ఎక్కువ కాలం గురైనప్పుడు ఎర్రరక్తకణాల ఉత్పత్తితో పోలిస్తే అవి క్షీణించే రేటు వేగంగా ఉంటుంది. భూమిపై మనిషి శరీరంలో ఒక సెకనుకు రెండు మిలియన్ల రక్తకణాల ఉత్పత్తి, క్షీణత జరుగుతుంది. ఆరు నెలల అంతరిక్ష మిషన్లలో భాగంగా.. ఆ క్షీణత సంఖ్య సెకనుకు 3 మిలియన్ల వరకు ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం వివరాలు నేచర్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి.
ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే ఈ స్పేస్ ఎనీమియాకు గురవడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది. దాంతో అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించొచ్చు. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. మిషన్‌లో భాగంగా స్పేస్‌లో ఉన్నంతకాలం ఎర్రరక్తకణాలు తగ్గుతూనే ఉంటాయని, ఈ పరిస్థితి హిమోలిసిస్ అంటారని అధ్యయనకర్తలు తెలిపారు. వ్యోమగాములు భూమిపైకి తిరిగివచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందని వెల్లడించారు. అయితే ఈ క్షీణతను ఎదుర్కొనేందుకు అధికంగా పోషకాహారం తీసుకోవాల్సి రావొచ్చని, ఈ పరిస్థితి వారి ఆరోగ్యంపై శాశ్వత ప్రభావం చూపొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.