వేసవి కాలంలో చాలామంది మజ్జిగను తరచుగా తాగుతారు. శరీరాన్ని చల్లబరుస్తుంది మరియు మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కాబట్టి డాక్టర్లు కూడా రికమెండ్ చేస్తారు. అయితే మజ్జిగలో కొంతమంది ఉప్పు కలుపుకొని తాగుతుంటారు. మరికొందరు మజ్జిగలో పంచదార కలిపి తాగుతారు. అయితే వీటి వల్ల ప్లస్ లు, మైనస్ లు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు .
మజ్జిగలో పంచదార కలపి తాగడం వల్ల శరీరానికి త్వరగా శక్తి లభిస్తుంది. వేసవి కాలంలో దాహం తీర్చడంతో పాటు శరీరాన్ని కూడా తొందరగా చల్లబరుస్తుంది. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల జీర్ణక్రియను మెరుగుపరిస్తే.. పంచదార రుచిని పెంచుతుంది. అలాగే మజ్జిగలోని ప్రోబయోటిక్స్ మనలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.మజ్జిగలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు కూడా బలపడతాయి. అంతేకాకుండా వేసవికాలంలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల శరీరంలోని ద్రవాలు తగ్గుతాయి. మజ్జిగ తాగడం వల్ల ఈ ద్రవాల సమతుల్యతను కాపాడుకోవచ్చు.
పంచదారలో కేలరీలు ఎక్కువగా ఉండటంతో..మజ్జిగలో పంచదారను ఎక్కువగా కలిపి తాగడం వల్ల శరీరంలో కేలరీలు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. పంచదార రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది కాబట్టి.. డయాబెటిస్ ఉన్నవారికి లేదా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి మజ్జిగలో షుగర్ కలిపి తాగడం చాలా ప్రమాదకరం.
మజ్జిగలో పంచదారకు బదులు తేనె లేదా పటిక బెల్లం కలిపి తాగొచ్చు. అలాగే మజ్జిగలో పుదీనా ఆకులు, నిమ్మరసం కలిపి తాగితే రుచిగా ఉంటుంది. రోజుకు ఒక గ్లాసు మజ్జిగ తాగినా శరీరానికి సరిపోతుంది. మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పానీయం అయినా కూడా, అందులో పంచదారను చేర్చడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి పలుచని మజ్జిగను ఉప్పు, పంచదార వంటివి కలుపుకొని తాగకుండా నేరుగా తాగితేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.