స్మూతీ పేరు చెప్పగానే మనందరకీ పండ్లతో చేసేవే గుర్తుకువస్తాయి. మరికొంతమంది అయితే కూరగాయలతో స్మూతీ తయారు చేసుకుంటారు. అయితే ఎప్పటిలాగే కాకుండా కాస్త డిఫరెంట్ గా రాగి, అరటిపండుతో చేసిన స్మూతీ.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట అల్పాహారంగా దీనిని తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
రాగి, బనానా స్మూతీకి కావాల్సిన పదార్ధాలు..
రాగి పిండి 3 స్పూన్లు లేదా 45 గ్రాములు, అరటి పండు ఒకటి, బెల్లం లేదా తాటి బెల్లం 15 గ్రాములు, పాలు , కొబ్బరి పాలు లేదా మజ్జిగ 200 మిల్లీ లీటర్లు, ఓ గ్లాసు వాటర్
బనానా, రాగి స్మూతీ తయారీ విధానం..
ముందుగా రాగి పిండిని 5 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత అరటి పండు, బెల్లం, రాగి పిండిని మిక్సీలో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత పాలు లేదా కొబ్బరిపాలను ఇందులో పోసి బాగా మృదువుగా అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి, బనానా స్మూతీ తయారవుతుంది.
బనానా, రాగి స్మూతీతో ఆరోగ్య ప్రయోజనాలు..
స్మూతీని ఆరోగ్యకరమైన అల్పాహారంగా చెబుతారు. బెల్లంలో ఐరన్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండే కారకాల్లో రాగి పిండి ముందు వరుసలో ఉంటుంది. కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇది ఓ వరంగా చెప్పొచ్చు. పాల స్థానంలో కొబ్బరి పాలను ఉపయోగించడం వల్ల బంక లేని సహజమైన ఆల్కలీన్ ఉండటంతో..వారికి మేలు చేకూరుతుంది.
ఎక్కువ పోషకాలు ఉండటం వలన పిల్లలకు పాలిచ్చే తల్లికి ఆహారంగా దీన్ని సిఫార్సు చేస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఆందోళన, రక్తపోటు, నిరాశ, మైగ్రేన్ లాంటి రోగాల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. అయితే డయాబెటిస్, ఊబకాయం ఉన్న వారు బెల్లం లేకుండా ఈ స్మూతీని తీసుకుంటే మంచిది. ఏది ఏమయినా వారు ఒకసారి వైద్యులను కూడా సంప్రదించాక.. తీసుకుంటే మంచిది.