బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో గెలుచుకుంది. అయితే సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్ ప్రదర్శన నిరాశ పరిచినప్పటికీ, టీమిండియా బౌలింగ్ విభాగం మాత్రం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా పేసర్లు కంగారూ బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించారు. భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శనతో సిరీస్‌లో ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలంచేశాడు.
ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సిరీస్‌లో బుమ్రా బౌలింగ్‌కు బలయ్యాడు. 8 ఇన్నింగ్స్‌లలో 6 సార్లు బుమ్రా చేతిలో పెవిలియన్ చేరిన ఖవాజా, ఈ విషయంపై స్పందిస్తూ బుమ్రా బౌలింగ్‌ను “బుమ్రాడ్” అనుభవంగా అభివర్ణించాడు. సిడ్నీ టెస్టు తర్వాత ఏబీసీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ, బుమ్రా బౌలింగ్ తనను పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని, ఇది అతని మ్యాజిక్ అని ఒప్పుకున్నాడు.
ఈ సిరీస్‌లో బుమ్రా 32 వికెట్లు తీసి అత్యధిక వికెట్ తీసిన బౌలర్‌గా నిలిచాడు. 13.06 సగటుతో బుమ్రా బౌలింగ్ చేసిన విధానం అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గౌరవాన్ని తెచ్చిపెట్టింది. గాయాలతో బాధపడుతూ కూడా సిరీస్‌లో ఆడిన బుమ్రా, సిరీస్‌లో కెప్టెన్సీ బాధ్యతలు కూడా మోశాడు. ఖవాజా మాట్లాడుతూ, 2018 నుంచి బుమ్రాను గమనిస్తున్నానని, అయితే ఈ సిరీస్‌లో అతను అత్యంత కఠినమైన బౌలర్‌గా కనిపించాడని ప్రశంసించాడు.