క్రికెట్ లవర్స్ ఫోకస్ మొత్తం ఇప్పుడు దుబాయ్‌పైనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఎవరు గెలుస్తారనే ఫీవర్ క్రికెట్ ఫ్యాన్స్‌ని ఊపేస్తోంది. నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క టికెట్ ధర 3 లక్షలు పలుకుతోంది. ఇప్పటికే క్రికెట్ అభిమానులంతా దుబాయ్‌లో వాలిపోయారు. భారత జట్టు గెలవాలని ఇండియాలోని క్రికెట్ అభిమానులు పూజలు చేస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమి ఎరుగని ఎదురులేని జట్టుగా బరిలోకి దిగుతోంది భారత్. ఈ టోర్నీలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫైనల్లో అడుగు పెట్టింది భారత్. మూడు లీగ్ మ్యాచ్‌లతో పాటు సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టును ఓడించడంతో భారత్ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఉంది. లీగ్ మ్యాచుల్లో వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను ఓడించింది టీమిండియా. ఇక సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో వరుసగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది భారత్. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోగా, 2017లో రన్నరప్‌గా నిలిచింది. ఇక ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఉంది రోహిత్ సేన.
భారత జట్టులో విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండటం ప్లస్ పాయింట్.. ఒంటి చేత్తో విజయాలు అందించగల సత్తా విరాట్ సొంతం. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీని ఓ అరుదైన రికార్డ్ ఊరిస్తోంది. ఫైనల్ మ్యాచ్‌లో 45 పరుగులు చేస్తే క్రిస్ గేల్ రికార్డ్‌ను బద్దలు కొడతాడు కోహ్లీ. ఇక సెంచరీ చేస్తే న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డ్‌ను బద్దలు కొడతాడు కోహ్లీ.
ఛాంపియన్స్ ట్రోఫీలో అనుకున్నంతగా రాణించని కెప్టెన్ రోహిత్‌శర్మ ఫైనల్ మ్యాచ్‌లో తన విశ్వరూపాన్ని చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్డిక్ పాండ్యా ఫామ్‌లో ఉండటం భారత్‌కు ప్లస్ పాయింట్స్. అటు బౌలింగ్‌లో మహ్మద్ షమీ పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తున్నాడు. అక్షర్, పటేల్, కుల్‌దీప్ యాదవ్‌లతో భారత్ బౌలింగ్ లైనప్ బలంగా ఉంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మకు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే రోహిత్‌శర్మ వన్డేలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ రోహిత్‌శర్మ వన్డే కెరీర్‌ను డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. వన్డే జట్టుకు కెప్టెన్‌గా హార్డిక్ పాండ్యా, శుభ్‌మన్‌గిల్ పేర్లను పరిశీలిస్తోంది బీసీసీఐ. అటు న్యూజిలాండ్ జట్టును తక్కువ అంచనా వేయొద్దని టీమిండియా మాజీ ప్లేయర్స్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విలియమ్సన్, మిచెల్ శాంట్నర్, డేవిడ్ మిల్లర్, క్లాసెన్‌లతో జాగ్రత్త అంటున్నారు.