టీ20ల్లో రికార్డు స్కోరు చేసిన టీమిండియా..

Cleansweep Defeat For Bangladesh Team India Has Scored A Record In T20

టీ20 క్రికెట్‌ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా అద్భుత విజయం సాధించింది. శనివారం ఇక్కడి రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్, టీ20 క్రికెట్‌లో వరల్డ్ నంబర్ 1 టీమ్ ఇండియా 133 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా 20 ఓవర్లలో 297/6 స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఓపెనర్ సంజూ శాంసన్ (111), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (75) రెండో వికెట్‌కు 70 బంతుల్లో 170 పరుగుల రికార్డు నెలకొల్పడంతో జట్టు భారీ స్కోరు సాధించింది.

బంగ్లాదేశ్ జట్టు బౌలర్లను ఊచకోత కోసిన సంజూ శాంసన్ తాను ఎదుర్కొన్న 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. అంతే కాకుండా, అతను 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడం విశేషం.. ఇది T20I క్రికెట్ చరిత్రలో భారతదేశం తరపున రెండవ ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. సంజూకు మంచి సహకారం అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులతో విజృంభించగా, స్లాగ్ ఓవర్లలో రెచ్చిపోయిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 18 బంతుల్లో 47 పరుగులు చేశాడు.

ఫలితంగా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో భారత జట్టు 2వ అత్యధిక స్కోరు సాధించిన రికార్డు సృష్టించింది. ICC (టెస్ట్ క్రికెట్ ఆడుతున్న) పూర్తి సభ్యత్వం కలిగిన జట్లలో అత్యధిక T20I స్కోరు సాధించిన జట్టుగా టీమ్ ఇండియా ప్రపంచ రికార్డు సృష్టించింది.

బంగ్లాదేశ్‌కు క్లీన్‌స్వీప్‌ ఓటమి

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ కోల్పోయిన బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు మూడు మ్యాచ్‌ల టీ20 క్రికెట్ సిరీస్‌లోనూ అదే ఓటమిని చవిచూసింది. 298 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధనలో బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 164 పరుగులు చేసి 133 పరుగుల తేడాతో ఓడిపోయింది.

బంగ్లాదేశ్ తరఫున చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన మహ్మదుల్లా 8 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ 25 బంతుల్లో 8 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. యువ ఆటగాడు తౌహిద్ హృదయ్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 63* పరుగులు చేసి జట్టు ఓటమి అంతరాన్ని తగ్గించాడు. టీమ్ ఇండియా బౌలింగ్ లో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 30 పరుగులకు 3 వికెట్లు తీశాడు. యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ 32 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్‌ సుందర్‌, నితీశ్‌ రెడ్డి వికెట్లు తీశారు.

సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. మూడో మ్యాచ్‌లో రికార్డు సెంచరీ చేసిన సంజూ శాంసన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.