బంగ్లాదేశ్‌తో ఇక్కడి ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ సాధించాడు. ఈ సెంచరీ చేయడం ద్వారా తన హోం గ్రౌండ్ లో తన అభిమానుల ముందు టెస్ట్ కెరీర్‌లో ఆరో సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో ప్రత్యేక రికార్డును నెలకొల్పాడు.
ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో హసన్ మహమూద్ అద్భుత బౌలింగ్‌తో భారత్ 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు కష్టాల్లో పడింది. జడేజాతో బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన ఆర్ అశ్విన్ చెన్నైలో రెండో టెస్టు సెంచరీ సాధించాడు.
కేఎల్ రాహుల్ వికెట్ తరువాత క్రీజులోకి వచ్చిన ఆర్ అశ్విన్ 112 బంతుల్లో 2 సిక్సర్లు, 10 ఫోర్లతో అజేయంగా 102 పరుగులు చేసి రవీంద్ర జడేజాతో కలిసి 7వ వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆర్ అశ్విన్ సెంచరీతో ప్రత్యేక రికార్డును లిఖించాడు.
అశ్విన్ ప్రత్యేక రికార్డు
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 1000 పరుగులు, 100 వికెట్లు సాధించిన రెండో క్రికెటర్ అశ్విన్. అంతకుముందు భారత జట్టులోని మరో స్పిన్ ఆల్ రౌండర్ ఆర్ జడేజా ఈ ఘనత సాధించాడు. అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేయడంతో ఈ ఘనత సాధించాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఓవరల్ గా అశ్విన్ 174 వికెట్లు తీశాడు.
ఇంగ్లండ్‌పై జడేజా ఈ రికార్డు నెలకొల్పాడు
ప్రపంచ నంబర్ 1 టెస్ట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 1000 పరుగులు మరియు 100 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలో రాంచీలో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో జడేజా ఈ ఘనత సాధించాడు. టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో మొత్తం 11 మంది బౌలర్లు 100 వికెట్లు తీయగా. అశ్విన్, జడేజా మినహా ఏ ఆటగాడు కూడా 1000 పరుగులు చేయలేదు.
నాథన్ లియాన్ రికార్డు బద్దలు
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ 187 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆర్ అశ్విన్ ప్రస్తుతం 174 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాథన్ లియాన్‌ను అధిగమించేందుకు అశ్విన్‌కు కేవలం 14 వికెట్లు మాత్రమే అవసరం.
భారత జట్టు 336 పరుగులు చేసింది
తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (86 పరుగులు), ఆర్ అశ్విన్ (102*) రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించనున్నారు. అంతకుముందు యశవ్ జైస్వాల్ (56 పరుగులు) అర్ధ సెంచరీతో చెలరేగాడు.