వెల్లింగ్టన్ లో బేసిన్ రిజర్వ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి భారత్ జట్టు ప్రారంభంలోనే వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. మొదటి రోజు 55 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. పృథ్వీషా(16), పుజారా(11), కెప్టెన్ విరాట్ కోహ్లీ(2), హనుమ విహారి (7) పరుగులతో విఫలమయ్యారు. మయాంక్ అగర్వాల్(34), రహానె (38) ) పరుగులతో జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. 55 ఓవర్ల తర్వాత వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. అనంతరం వాతావరణం అనుకూలించకపోవడంతో మొదటిరోజు ఆటను నిలిపివేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.
ఓవర్‌నైట్ స్కోరు 122/5తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ తోలి గంటలోనే ఆలౌటైంది. అజింక్యా రహానె(46), రిషబ్ పంత్(19) పరుగులు చేయగా, చివర్లో మహమ్మద్ షమీ (20) బ్యాట్ ఝళిపించడంతో మొదటి రోజు స్కోర్ కు మరో 43 పరుగులు జోడించి 165 పరుగులు వద్ద భారత్ ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, జేమిసన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ బ్యాట్స్‌మెన్ ను ఇబ్బంది పెట్టారు. అలాగే బౌల్ట్ ఒక వికెట్ తీశాడు. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు టీ విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (11), టామ్ బ్లండెల్ (30) పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం కెప్టెన్ కేన్ విలియమ్సన్ (46*), రాస్ టేలర్ (22*) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ భారత్ బౌలర్లను దీటుగా ఎదుర్కుంటూ తొలి టెస్టులో ఆధిపత్యం సాధించే దిశగా సాగుతున్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ మాత్రమే ప్రభావం చూపుతూ రెండు వికెట్లు పడగొట్టాడు.