IPL 2025: మెగా వేలంలో కాసుల పంట పండించే స్టార్ ఆల్ రౌండర్లు వీరే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలం ప్రక్రియకు కేవలం 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తం పది ఐపీఎల్ జట్లలో రిటైన్ చేయబడిన, విడుదలైన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇప్పటికే సమర్పించింది. ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో స్టార్ ప్లేయర్స్ ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది అందరి దృష్టి మళ్లీ ఆల్‌రౌండర్లపై పడింది. ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. శామ్ కుర్రాన్, బెన్ స్టోక్స్ వంటి ఆటగాళ్లు రికార్డు ధర పలికారు. ఈసారి కూడా వేలంలో ఆల్‌రౌండర్లు అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. అత్యధిక మొత్తానికి బిడ్ చేయబడతారు అనే అంచనాలున్న టాప్ 5 స్టార్ ఆల్ రౌండర్ల జాబితా కింద ఇవ్వబడింది.

గ్లెన్ మాక్స్‌వెల్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్‌ను జట్టు నుండి విడుదల చేసింది. ఐపీఎల్ 2024లో మ్యాక్స్‌వెల్ పేలవ ప్రదర్శన చేశాడు. కానీ మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ సూపర్ ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. అందువల్ల, అతను IPL 2025 వేలంలో భారీ మొత్తాన్ని దక్కించుకునే అవకాశముంది.

సామ్ కరణ్: గత సీజన్‌లో రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ ఆల్ రౌండర్ శామ్ కరణ్‌ను పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది. ఇప్పుడు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. గతసారి శిఖర్ ధావన్ గైర్హాజరీలో కరణ్ పంజాబ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా అతడిపై కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది.

మార్కస్ స్టోయినిస్: IPL 2025 వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఈ ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను అంటిపెట్టుకోలేదు. ఇప్పుడు అతను వేలంలో ఖచ్చితంగా అట్రాక్షన్ గా నిలుస్తాడనటంలో సందేహం లేదు. అతను బ్యాటింగ్‌తో పాటు, తన ఫాస్ట్ బౌలింగ్‌ చేయగలడు. దీంతో స్టోయినిస్ వేలంలో చాలా ఎక్కువ ధర పలకవచ్చు.

టిమ్ డేవిడ్: ముంబై ఇండియన్స్ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్‌ను విడుదల చేసింది. పవర్ హిట్టింగ్ బ్యాటింగ్, మెరుపు ఫీల్డింగ్‌కు పేరుగాంచిన డేవిడ్‌ను గత సీజన్‌లో ముంబై రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి కూడా డేవిడ్ చాలా జట్ల జాబితాలో ఉంటాడు.

కామెరాన్ గ్రీన్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కోసం కామెరాన్ గ్రీన్‌ని RCB అంటిపెట్టుకోలేదు. గ్రీన్‌ను మొదట ముంబై ఇండియన్స్ రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో RCBకి 17.50 కోట్లు వరకు  కొనుగోలు చేసింది. ప్రస్తుతం గాయపడిన అతడు దాదాపు 5-6 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియా జట్టుకు దూరమయ్యాడు. అందుకే అతనిన్ని ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే