ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ తర్వాత జస్‌ప్రీత్ బుమ్రాకు అప్పగించడం సరైన ఆప్షన్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ వేదికగా రోహిత్ శర్మ దూరంగా ఉన్న సమయంలో, బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. తన అద్భుతమైన బౌలింగ్, సమర్థమైన కెప్టెన్సీతో టీమిండియాను చారిత్రాత్మక విజయానికి నడిపించాడు.
అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో రోహిత్ శర్మ తిరిగి జట్టును నడిపించినా, భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. బ్రిస్బేన్ టెస్టులో వర్షం అంతరాయం కలిగించి మ్యాచ్‌ను డ్రాగా ముగించడానికి తోడ్పడింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ సాధించిన విజయాలు ఆశించిన స్థాయికి చేరుకోకపోవడం స్పష్టమవుతోంది.
ఈ పరిస్థితుల్లో బుమ్రా కెప్టెన్సీ అద్భుతమైన ఆప్షన్ అవుతుందని బోర్డర్ అభిప్రాయపడ్డాడు. “పెర్త్ టెస్టులో బుమ్రా అసాధారణంగా తన ఫీల్డ్ సెటప్ ప్లాన్ చేశాడు. తాను బౌలింగ్ చేసే సమయాన్ని కూడా ఎంతో సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు,” అని బోర్డర్ చెప్పాడు. అలెన్ బోర్డర్ ప్రత్యేకంగా బుమ్రా బౌలింగ్ శైలిని ప్రశంసించాడు. “అతని రన్నప్, బంతిని వదిలే శైలి, మణికట్టు కదలిక, అన్నీ కలిపి బ్యాట్సమెన్ కు కొత్త ఛాలేంజులను పుట్టిస్తాయని,” అని వివరించాడు. ఈ మెల్‌బోర్న్ టెస్టు (డిసెంబర్ 26) తర్వాత రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలపై స్పష్టత రావచ్చని పండితులు భావిస్తున్నారు.