అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న విరాట్ కోహ్లి ఇప్పుడు మూడు సరికొత్త రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నాడు. అయితే ఇవి ఏకంగా ప్రపంచ రికార్డులకు సంబంధించినవి కావడంతో.. అందరి చూపు కోహ్లీపైనే నిలిచింది. బంగ్లాదేశ్ తో సిరీస్ లో అతడు ఊహించిన విధంగా రాణిస్తే ఏకంగా మూడు అరుదైన రికార్డులను తిరగరాయనున్నాడు. అందులో సచిన్, బ్రాడ్‌మన్ రికార్డులూ ఉన్నాయి.
9 వేల పరుగులు:బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో విరాట్ కోహ్లీ మొత్తం 152 పరుగులు చేస్తే టెస్టు కెరీర్లో 9000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అదే జరిగితే నాలుగో భారతీయుడిగా విరాట్ ఈ మైలురాయిని అందుకోనున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 113 టెస్టుల్లో 191 ఇన్నింగ్స్ లొ 8848 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (15921), రాహుల్ ద్రవిడ్ (13288), సునీల్ గవాస్కర్ (10122) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. వీరు మాత్రమే టెస్టుల్లో 9,000 పరుగులు చేసిన భారతీయులు. కోహ్లీ మరో 152 పరుగులు చేస్తే, టెస్టుల్లో 9000+ పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు.
12 వేల పరుగులు: అంతర్జాతీయ క్రికెట్‌లో స్వదేశంలో 12 వేల పరుగులు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీకి 11 పరుగులు మాత్రమే కావాలి. బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో అతను 11 పరుగులు స్కోరు చేస్తే.. ఈ ఘనత సాధించిన ప్రపంచంలో 5వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ (14192), రికీ పాంటింగ్ (13117), జాక్వెస్ కలిస్ (12305), కుమార సంగక్కర (12043) మాత్రమే ఈ ఘనత సాధించారు.
27 వేల పరుగులు:అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగులు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీకి 58 పరుగులు మాత్రమే అవసరం. బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరగనున్న టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ 58 పరుగులు సాధిస్తే.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 27 వేల పరుగులు పూర్తి చేసిన ప్రపంచ రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (623 ఇన్నింగ్స్) పేరిట ఉంది. ఇప్పుడు 591 ఇన్నింగ్స్‌లలో 26942 పరుగులు చేసిన కోహ్లి బ్యాటింగ్ నుంచి ఈ గొప్ప రికార్డులను ఆశించవచ్చు.
30 సెంచరీలు:బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో కోహ్లీ సెంచరీ సాధిస్తే టెస్టు చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో డాన్ బ్రాడ్ మన్ ను అధిగమిస్తాడు. విరాట్ ఇప్పటివరకు 113 టెస్టుల్లో 191 ఇన్నింగ్స్ లో 29 సెంచరీలు చేశాడు. డాన్ బ్రాడ్ మన్ 52 టెస్టుల్లో 80 ఇన్నింగ్స్ ల్లో బ్యాటింగ్ చేసి 29 సెంచరీలు చేశాడు. ప్రస్తుతం బ్రాడ్‌మన్ తో సమానంగా ఉన్న విరాట్.. అతన్ని అధిగమించే అవకాశం ఈ సిరీస్ లో రానుంది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో, విరాట్ కోహ్లీ అనుకున్న విధంగా రాణిస్తే ఈ 4 గొప్ప రికార్డులను అధిమించే అవకాశముంది. మరి తొలి టెస్టు మ్యాచ్‌లో ఏ రికార్డు సృష్టిస్తాడో చూడాలి.