ఐపీఎల్ 2025 సన్నాహాల్లో స్టార్ క్రికెటర్: దియూరి ఆలయాన్ని సందర్శించిన ఎంఎస్ ధోని

MS Dhoni Visits Deori Temple Preparing For IPL 2025 With Devotion

భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న అభిమాన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలాకాలం గడిచినా, ధోని క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ధోని ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతూ, తన అభిమానులకు సంతోషాన్ని పంచుతున్నాడు. ఇప్పుడు అతను ఐపీఎల్ 2025 సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించాడు.

తాజాగా, ధోని రాంచీలోని 700 ఏళ్లకు పైగా పురాతనమైన దియూరి ఆలయాన్ని సందర్శించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ భద్రత మధ్య ధోని ఆలయాన్ని సందర్శించగా, అతని చేతిలో ఎరుపు రంగు వస్త్రం కనిపించింది. నుదుటిపై తిలకం ధరించిన ధోని ఆలయంలో పూజలు నిర్వహించాడు.

ధియూరి ఆలయానికి ధోని రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ దేవాలయాన్ని సందర్శించి, ఆ దేవత ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఈసారి కూడా ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆ దేవత ఆశీర్వాదాలను కోరాడు.

సీఎస్‌కే వద్దే ధోని:
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ ధోనీని రూ. 4 కోట్లకు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా తమతోనే కొనసాగించింది. దీని కారణంగా ధోనీ మరోసారి ఎల్లో జెర్సీతో మైదానంలో దిగనుండటంతో సీఎస్‌కే అభిమానుల్లో ఆనందం నెలకొంది.

ఐపీఎల్ 2024లో ధోని పెద్దగా పరుగులు చేయకపోయినా, తన సునామీ బ్యాటింగ్‌తో అభిమానులకు ఉత్సాహం ఇచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోని ఎలా ఆడతాడో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.