2027 వన్డే ప్రపంచ కప్‌ లో ఆడనున్న రోహిత్ శర్మ!

Rohit Sharma Will Play In 2027 ODI World Cup Says Rohit Sharmas Childhood Coach

వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ట్వంటీ-20 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై విజయం సాధించి వల్డ్ చాంపియన్ గా నిలిచిన టీమిండియా అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. అయితే ఆ మ్యాచ్ అనంతరమే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి దిగ్గజాలు టీ20 క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఈ ముగ్గురూ ఇప్పుడు భారత జట్టు తరఫున వన్డే, టెస్టు ఫార్మాట్లలో ఆడుతున్నారు. కాగా, 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టుకు రోహిత్ నాయకత్వం వహిస్తాడని రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ జోస్యం చెప్పాడు.

టెస్టు క్రికెట్‌కు రోహిత్ వీడ్కోలు ప్రకటించే అవకాశం

రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ప్రస్తావించిన దినేష్ లాడ్. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడవ ఎడిషన్ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించవచ్చని చెప్పాడు. ఒకవేళ అతను అలా చేస్తే, అతను టెస్ట్ నుండి రిటైర్ అయ్యేంత వయస్సులో ఉన్నందున అతను ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉండవచ్చు అన్నాడు. అయితే అతను వన్డే క్రికెట్ నుండి రోహిత్ అంత తొందరగా రిటైర్మెంట్ ప్రకటించబోడని చెప్పాడు.

రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ ఖచ్చితంగా ఆడతాడు

“ఒక వేళ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తే దాని వెనక ఓ కారణం ఉందన్నాడు. అతను ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి వన్డే క్రికెట్‌లో కొనసాగాలనుకోవడమే అన్నాడు. ఏది ఏమైన రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్‌లో 100% ఆడతాడని నేను మీకు హామీ ఇస్తున్నాను అని దినేష్ లాడ్ అన్నారు.

హిట్ మ్యాన్ ట్వంటీ-20 క్రికెట్‌కు వీడ్కోలు

ఫిట్టర్ యూట్యూబ్ ఛానెల్‌తో ఇటీవల సంభాషణలో, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ T20I ఫార్మాట్‌కు వీడ్కోలు ప్రకటించడానికి గల కారణాన్ని వెల్లడించాడు. “తన వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పొట్టి రిటైర్మెంట్ తీసుకున్నాడని.. కానీ రోహిత్ లాంటి ఆటగాడు ఈ తరహా క్రికెట్ ఆడటం చాలా సంతోషంగా ఉంటుందన్నాడు. వరల్డ్ కప్ గెలిచిన క్షణమే రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం” అని హిట్ మ్యాన్ చెప్పిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్ సిరీస్‌కు రోహిత్ శర్మ సన్నద్ధత..

ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించిన రోహిత్ 2-0తో సిరీస్ క్లీన్ స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభ మ్యాచ్ అక్టోబర్ 16 నుండి బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ సన్నద్ధమవుతున్నాడు. అభిమానులు సైతం రోహిత్ శర్మ కెప్టెన్సీ, బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.