బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన యువ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, సర్ఫరాజ్ ఖాన్‌లపై క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో అద్భతంగా ఆడిన షర్ఫరాజ్ ఖాన్ తొలి సెంచరీ చేసి సత్తా చాటాడు. కాగా గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండుల్కర్ యువ ఆటగాళ్లను అభినందిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
మూడో రోజు మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర ఆతిథ్య బౌలర్లను శాసిస్తూ సెంచరీ చేయడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్‌లో తొలి టెస్టు సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్.. రచిన్ సెంచరీని మరిపించడమే కాదు జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు.
ఇద్దరు ప్రతిభావంతులైన ఆటగాళ్లు: సచిన్ టెండూల్కర్
“క్రికెట్ మన పూర్వీకుల నేలతో మనల్ని కలుపుతుంది. రచిన్ రవీంద్రకు బెంగళూరుతో విడదీయరాని అనుబంధం ఉంది. అతని కుటుంబం ఇక్కడ స్థిరపడింది. అతని ఖాతాలో మరో సెంచరీ చేరింది. అని రచిన్ రవీంద్రను పొగుడుతూ సచిన్ ట్వీట్ చేశాడు.
సర్ఫరాజ్ ఖాన్ తొలి సెంచరీ
సర్ఫరాజ్ ఖాన్ సెంచరీపై స్పందించిన సచిన్.. అతన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇది నీ కష్టానికి ప్రతిఫలం అని పేర్కొన్న సచిన్.. ఈ విధమైన ప్రదర్శనను టీమ్ ఇండియా ఊహించిందని.. అతను తన సెంచరీతో జట్టులో స్ఫూర్తినింపాడని అని సచిన్ టెండూల్కర్ అన్నాడు. గాయం సమస్యతో బాధపడుతున్న శుభమాన్ గిల్ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్ లో మూడు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ సమర్పించుకున్నాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో 350 పరుగులకు పైగా లోటుతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను సర్ఫరాజ్ ఖాన్ ఆదుకున్నాడు.. ఒత్తిడిని సమర్ధవంతంగా ఎదుర్కొని సెంచరీని సాధించాడు. తద్వారా భారత జట్టు తరఫున తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యి రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన 22వ ఆటగాడిగా నిలిచాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఈ రికార్డు సృష్టించాడు.
న్యూజిలాండ్‌కు 107 పరుగుల లక్ష్యం
354 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. కెప్టెన్ రోహిత్ శర్మ (52 పరుగులు), విరాట్ కోహ్లి (70 పరుగులు), రిషబ్ పంత్ (99 పరుగులు) హాఫ్ సెంచరీలు చేయగా సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులు చేశాడు. దీంతో భారత్ 462 పరుగులకు ఆలౌటైంది. మాట్ హెన్రీ, విలియం ఒరూక్‌లు చెరో మూడు వికెట్లు తీయగా, ఐజాజ్ పటేల్ (2 వికెట్లు), టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీశారు. 107 పరుగుల విజయ లక్ష్యంతో న్యూజిలాండ్ ఐదవ రోజు బ్యాటింగ్ కొనసాగించనుంది.