భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, భారతజట్టుకు మహేంద్రసింగ్ ధోని ఎంపికయ్యే విషయంపై స్పందించారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకు ధోని కొనసాగడం కష్టమే అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ధోని ఎటువంటి అవమానాలు ఎదుర్కోకముందే గౌరవంగా క్రికెట్ నుంచి తప్పుకోవాలని సూచించారు. ధోని ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా ఊహించారని, ధోని సైలెంట్ గా ఉండడంతో బీసీసీఐ కూడ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుందని చెప్పారు. వరుసగా అన్ని సిరీస్ లలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు అవకాశాలు కల్పించడంతోనే, సెలెక్టర్లు ధోనికి పరోక్షంగా విషయం చెప్పేశారని గవాస్కర్ పేర్కొన్నారు.
38 ఏళ్ల ధోని వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఆడడం దాదాపు అసాధ్యమే అని గవాస్కర్ చెప్పుకొచ్చారు. భారత జట్టు ధోనిని దాటి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్న రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్ గా ధోనిని ఎంపిక చేయాలా అనే ప్రశ్నకు జవాబిస్తూ, ధోని భారత జట్టుకు అనేక సేవలందించాడు, కానీ తనకు నా జట్టులో స్థానం లేదని పేర్కొన్నారు, తన ఎంపిక మాత్రం రిషబ్ పంత్ అని చెప్పారు. వచ్చే టీ20 ప్రపంచకప్ కోసమైతే రిషబ్ పంత్ పైనే దృష్టి పెట్టాలని, కావాలంటే అతనికి ప్రత్యామ్నాయంగా బ్యాటింగ్ లో కూడ ప్రతిభ చూపించే సంజూ శాంసన్ కు కూడ అవకాశమివ్వచ్చని తెలిపారు. ప్రపంచ కప్ కోసం కుర్రాళ్ల పైనే దృష్టిసారించాలని కోరారు.