శ్రీలంక పర్యటనలో టీమిండియాకు మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. టీ20 సిరీస్‌ను అలవోకగా క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం తడబడుతోంది. అతిథ్య జట్టు ధాటికి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టీమిండియ స్ట్రగుల్ అయింది. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా కొంపముంచింది మిడిలార్డర్ వైఫల్యమే. సునాయసంగా గెలవాల్సిన తొలి వన్డేను చేజేతులా టై చేసుకున్న భారత్.. రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో చిత్తయ్యింది. రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 97 పరుగులు చేసిన భారత్.. మరో 50 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ ఔటైన అనంతరం భారత ఇన్నింగ్స్ పేకమేడలా కుప్ప కూలింది. విరాట్ కోహ్లీ(14), శివమ్ దూబే(0), శ్రేయస్ అయ్యర్(7), కేఎల్ రాహుల్(0) దారుణంగా విఫలమయ్యారు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(44) ఒంటరి పోరాటం చేసినా అతనికి మరో ఎండ్‌లో సహకారం లభించలేదు.
లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం గౌతమ్ గంభీర్ చేసిన ప్రయోగాలే టీమిండియా కొంపముంచాయని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను పంపించకుండా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం గంభీర్.. శివమ్ దూబేను అప్‌ది ఆర్డర్ పంపించాడు. స్పిన్‌ను సమర్థవంతంగా ఆడగలడని బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇస్తే.. సరైన ఫుట్‌వర్క్ లేక వికెట్ల ముందు దొరికిపోయాడు. డకౌట్‌గా పెవిలియన్ చేరి భారత బ్యాటర్లపై అనవసరం ఒత్తిడిని పెంచాడు. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్‌ను పంపించకుండా గంభీర్.. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్‌ను బరిలోకి దించగా.. మరో ఎండ్‌లో కోహ్లీ ఔటయ్యాడు. ఆరు, ఏడో స్థానాల్లో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్, రాహుల్ కూడా తీవ్రంగా నిరాశపరిచారు.
లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం కాకుండా భారత బ్యాటర్లను వారి వారి స్థానాల్లో ఆడించి ఉంటే ఒత్తిడికి తగ్గట్లు బ్యాటింగ్ చేసేవారని, ఓ కీలక భాగస్వామ్యాన్ని అందించేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గంభీర్ చేసిన ప్రయోగాలే టీమిండియా ఓటమికి కారణమైందని నెటిజన్లు నెట్టింట విమర్శలు గుప్పిస్తున్నారు. మరో గ్రేగ్ చాపెల్‌లా టీమిండియాను గంభీర్ నాశనం చేస్తాడని హెచ్చరిస్తున్నారు.
అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉండటం వల్ల గంభీర్‌ను హెడ్ కోచ్‌గా సెలెక్ట్ చేసింది బీసీసీఐ. ఈ పదవిలో ఆయన ఎంతో కాలం కొనసాగలేకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలోనే ఆయన తప్పుకొంటారని, కొత్త హెడ్ కోచ్ రావొచ్చనే వాదనలు వినిపిస్తోన్నాయి. టీమిండియా మాజీ ప్లేయర్ జోగిందర్ శర్మ.. ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారు. జట్టులో ఇప్పుడున్న వారితో అతను అంత సులువుగా కలిసిపోలేడని అంచనా వేశాడు.