చెన్నై టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో పోరాడి సెంచరీ (113) సాధించిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్ బౌలింగ్‌లో తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో మరో ఐదు వికెట్లు (88 పరుగులకు 6) పడగొట్టి భారత జట్టుకు 280 పరుగుల భారీ విజయాన్ని అందించాడు.
ఈ విజయంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. 2021లో ఇదే ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కూడా అశ్విన్ సెంచరీ సాధించగా, ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన సొంత ప్రేక్షకుల ముందు రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అశ్విన్ తన 38వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఘనత సాధించాడు.
515 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో శుభారంభం లభించింది. ఓపెనర్లు జకీర్ హసన్ (33), షాద్‌మన్ ఇస్లాం (35) తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు గట్టి పునాది వేశారు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (127 బంతుల్లో 82 పరుగులు) చివరి వరకు పోరాడి జట్టు ఓటమి మార్జిన్ తగ్గించే ప్రయత్నం చేశాడు. స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ (25) ఇన్నింగ్స్ మధ్యలో కాస్త తడబడ్డాడు. అయితే నాలుగో రోజు మ్యాచ్‌లో పిచ్ స్పిన్నర్లకు మరింత సహకరిస్తుండగా.. బంగ్లా బ్యాటర్ల పోరాటం ఎక్కువ సేపు సాగలేదు.
భారత్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన
మ్యాచ్ తొలి రెండు రోజుల్లో ఫాస్ట్ బౌలర్లు రాణించారు. అయితే 3వ రోజు టీ విరామం తర్వాత పిచ్ స్పిన్నర్ల అనుకూలంగా మారింది. ఫాస్ట్ బౌలర్ల పరుగులతో పిచ్‌పై ఏర్పడిన ఫుట్‌మార్క్‌లను పూర్తిగా సద్వినియోగం చేసుకుని బంతిని మరింత మలుపు తిప్పిన టీమిండియా అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 88 పరుగులకే 6 వికెట్లతో మెరిశాడు. అతని టెస్టు క్రికెట్ కెరీర్‌లో ఇది 37వ ఐదు వికెట్లు. దీంతో ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ రికార్డును బద్దలు కొట్టాడు.
మ్యాచ్‌లో అశ్విన్‌కు బ్యాటింగ్ లో సహకరించిన రవీంద్ర జడేజా.. బౌలింగ్‌లోనూ అద్భుతంగా సహకరించి 58 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి బంగ్లా బ్యాటర్ల భరతం పట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లోనూ మెరిసాడు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌లో 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పాక్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి భారత్‌లో అదే తరహా ప్రదర్శన చేయలన్న ఆత్మవిశ్వాసంతో చెన్నైకి వచ్చిన బంగ్లాదేశ్ జట్టుకు టీమ్ ఇండియా ఝలక్ ఇచ్చింది. దీంతో భారత్‌లో టెస్టులు గెలవడం అంత ఈజీ కాదని తేలిపోయింది. సిరీస్‌లోని రెండో టెస్టు మ్యాచ్ కాన్పూర్‌లో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది. దీంతో 2-0తో క్లీన్‌స్వీప్ చేయాలని టీమ్ ఇండియా కసరత్తు చేస్తోంది.