బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. వర్షం కారణంగా సుమారు 8 సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. మరో సెషన్ మిగిలి ఉండగానే టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. 95 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.2 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్(51; 45 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లీ (29 నాటౌట్) రాణించారు. 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ జట్టు స్కోరు 18 పరుగుల వద్ద తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అటు వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్ గిల్ (6) విఫలం అయ్యాడు. అయినప్పటికి భారత్‌కు చింతించాల్సిన పని లేకుండా పోయింది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో బంగ్లాదేశ్ పై విరుచుకుపడ్డాడు. విజయానికి మూడు పరుగుల దూరంలో యశస్వి ఔట్ అయ్యాడు. అయితే.. కోహ్లీ మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశాడు.
నాలుగో రోజు రెండు వికెట్లకు 26 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‍ను నేడు ఐదో రోజు కొనసాగించింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్ ను భారత బౌలర్లు కుప్పకూల్చేశారు. భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలా మూడో వికెట్లతో సత్తాచాటారు. బంగ్లా ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (50) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ముష్పికర్ రహీం (37) కాస్త పోరాడాడు. మొత్తంగా టపాటపా వికెట్లు కోల్పోయిన బంగ్లా స్వల్ప 146 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు లభించిన 52 పరుగుల ఆధిక్యం తీసి వేయగా టీమ్ఇండియా ముందు 95 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.
వాస్తవానికి కాన్పూర్ టెస్టు డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు. ఎందుకంటే తొలి మూడు రోజుల్లో కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. అయితే నాలుగో రోజు ఆటలో భారత్ అద్భుతం చేసింది. బంగ్లాదేశ్‌ను 233 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత.. టీ20 మోడ్‌లోకి వెళ్లిపోయింది. బ్యాటింగ్‌లో బంగ్లాదేశ్ బౌలర్లకు భారత బ్యాటర్లు చుక్కలు చూపించారు. జరుగుతున్నది టెస్టు మ్యాచా లేక టీ20నా అనేంతలా పరుగుల వరద పారించారు. 34.4 ఓవర్లలోనే 285/9తో భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 52 పరుగుల లీడ్ లభించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను 144 పరుగులకే కుప్పకూల్చి.. విజయాన్ని ఖరారు చేసుకుంది.
ఇప్పటికే తొలి టెస్టులో 280 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత్.. కాన్పూర్ టెస్టులోనూ గెలిచి.. టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.