భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అప్పీలుపై మంగళవారం రాత్రి తీర్పు రానుండటంతో..తీర్పు ఎలా ఉండబోతుందంటూ భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే మరోసారి కూడా కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) తీర్పును వాయిదా వేయడంతో ఒక్కసారిగా నిరుత్సాహానికి గురవయ్యారు.
వినేశ్ ఫొగాట్ అప్పీలుపై తీర్పును ఆగస్ట్ 16 రాత్రి 9.30 గంటల్లోపు వెల్లడిస్తామని కాస్ పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో 100 గ్రాముల బరువు అదనంగా ఉందని వినేశ్‌పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఫైనల్‌కు ముందు ఇలా జరగడంతో సర్వత్రా విస్మయం వ్యక్తమైంది.దీంతో తీవ్ర వేదనకు గురయిన వినేశ్ రెజ్లింగ్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పేసింది.
అయితే కాస్‌కు అప్పీలు చేసిన వినేశ్‌కు తుది తీర్పుపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.మంగళవారం వస్తుందన్న తీర్పు కాస్తా ఇప్పుడు శుక్రవారానికి వాయిదా పడటంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. వినేశ్ కేసు ఎందుకు వాయిదా పడుతుందో అర్థంకావడం లేదంటూ నెటిజన్లు ఫైర్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు.
రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తనపై అనర్హత వేటు విధించిన వెంటనే.. వినేశ్ ఫొగాట్ తన లీగల్ టీమ్ అప్పీలు దాఖలు చేసింది. ఫ్రెంచ్ లాయర్లు జోలీ మోనోలియస్, ఈస్తెల్లె ఇవనోవా, హబ్బినె ఇస్తెల్లె కిమ్, ఛార్లెస్ ఆమ్సన్ దీనిలో ఉన్నారు. ఐఈవోతో కలిసి ఆమె దరఖాస్తు చేశారు.
ఆ తర్వాత భారత సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, విదుష్‌పత్ సింఘానియా తమ వాదనలు వినిపించారు. కీలక విషయాలను కాస్ ఎదుట ప్రస్తావించారు. వాదనలు విన్న కాస్.. తన తీర్పును ఇప్పటికే మూడుసార్లు పొడిగించారు. దీంతో కొందరు నెటిజన్లు మండిపడుతూ పోస్టులు పెడుతున్నారు.
ఇలాగే వాయిదాలు వేస్తూ పోతుంటే వినేశ్ కేసు గురించి భారతీయులు మర్చిపోతారని కాస్ భావిస్తుందేమో అందుకే ఇలా చేస్తుందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వినేశ్ కు న్యాయం జరగాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు. సినిమాల్లో చూసినట్లే బయట కూడా జరుగుతుందంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.