పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు నాలుగో పతకం ఖాయమైంది. భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ లోపెజ్‌తో జరిగిన పోరులో ఫొగాట్ ఏకంగా 5-0 తేడాతో చిత్తుగా ఓడించి ఘన విజయాన్ని సాధించింది.
దీంతో ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలోనే ఫైనల్‌కు దూసుకెళ్లిన తొలి భారతదేశపు మహిళగా వినేశ్ రికార్డ్ సృష్టించింది.ఒకవేళ తుది పోరులో పొగాట్ గెలిస్తే..ఆమె పేరు సువర్ణాక్షరాలతో మారుమోగిపోనుంది. ఈ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో వినేష్ పొగాట్ గెలిస్తే ఇదే తొలి పతకం కానుంది.
ఈ ఒలింపిక్స్‌లో సూపర్ ఫామ్‌తో అదరగొట్టిన వినేశ్ పొగాట్..సెమీస్‌లో క్యూబా అమ్మాయిని మ్యాచ్ ఆరంభం నుంచే తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసింది. తొలి నుంచి ఆదిపత్యం చెలాయించిన వినేష్ ఫొగాట్ ఎక్కడ కూడా తడబడకుండా.. పట్టుసడలకుండా ఆడుతూ వెళ్లింది. తొలి రెండు నిమిషాల వరకు వినేశ్‌కు ఒక్క పాయింట్ కూడా దక్కలేదు.
ఆ తర్వాత ప్రత్యర్థి అటాకింగ్‌కు దిగడంతో వినేశ్ పొగాట్.. చాకచాక్యంగా ఆమె కాలిని మలిచి ఆమెను కోలుకోనీయకుండా చేసి శభాష్ అన్పించుకుంది. ఫస్ట్ హాఫ్‌లో ఒక టెక్నికల్ పాయింట్ సాధించిన ఫొగాట్.. రెండో హాఫ్‌లో వరుసగా రెండు పాయింట్ల చొప్పున సాధిస్తూ వచ్చింది. దీంతో ప్రత్యర్థి రెజ్లర్‌కు మ్యాచ్‌పై పట్టుసాధించడానికి కూడా ఏ మాత్రం అవకాశం లేకుండా పోయింది.
ఈ మ్యాచ్‌కు ముందు క్వార్టర్స్‌లో వినేశ్ పొగాట్ 7-5 తేడాతో ఉక్రెయిన్ క్రీడాకారిణి లివచ్ ఒక్సానాపై నెగ్గింది. ఇక ప్రీ క్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ సుసాకీకి కూడా ఈ భారత రెజ్లర్ భారీ షాక్ ఇచ్చింది. నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన జపాన్ ఛాంపియన్ సుసాకీని 3-2 తేడాతో ఓడించి.. ఒక్కసారిగా రెజ్లింగ్ ప్రపంచాన్నే తనవైపు తిప్పేసుకుంది.