టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో పర్యాటక బంగ్లాదేశ్ విఫలమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గ్వాలియర్‌లోని మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో టీమిండియా చేతిలో ఓడిపోయింది. ఈ విషయమై బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో మాట్లాడుతూ.. పరాజయానికి ప్రధాన కారణమేమిటో చెప్పాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు తొలి 6 ఓవర్లలో అంటే పవర్ ప్లే ఓవర్లలో 39 పరుగులు మాత్రమే చేసింది. బలమైన టీమిండియా బౌలింగ్ ధాటికి 127 పరుగులకే ఆలౌటైంది. మరోవైపు అదే పవర్ ప్లే ఓవర్లలో భారత జట్టు 71 పరుగులు చేసింది. ఫలితంగా 49 బంతులు మిగిలి ఉండగానే భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
‘‘పవర్ ప్లే ఓవర్లలో వైఫల్యం నిజంగా బాధించేదని బంగ్లా కెప్టెన్ శాంటో పేర్కొన్నాడు. మ్యాచ్‌కు ముందు మనం వేసుకున్న ప్రణాళికలు సక్రమంగా అమలు కావాలంటే బ్యాటింగ్‌లో మంచి ఆరంభం కావాలి. మొదటి ఆరు ఓవర్లలో వికెట్లు కాపాడుకోవాలి. మరిన్ని పరుగులు చేయాలి. లేకపోతే తరువాత ఓవర్లలో బ్యాటింగ్‌కి వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి రెట్టింపు అవుతుంది.
“మేం చెత్తగా ఏమి ఆడలేదు.. మేం కచ్చితంగా చెత్త జట్టు అయితే కాదు.. వ్యక్తిగత ప్రదర్శనల గురించి నేను చెప్పడం లేదు. ఈరోజు మా జట్టు బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది. “మా జట్టు బలంగానే ఉంది. కానీ మన సత్తాపై ఆధారపడి మన ఆటను మెరుగుపరుచుకోవాలి. గత 10 సంవత్సరాలుగా మా జట్టు బ్యాటింగ్ ఇలాగే ఉంది. మాకు మార్పు అవసరమని చాలాసార్లు నేను భావించాను. మేము సొంత పిచ్ లపై బ్యాటింగ్ చేసినట్లు ఇక్కడ చేస్తే కుదరదు.. అయితే ఇక్కడ పిచ్‌ను నిందించలేం. కాకపోతే తమ జట్టు మనస్తత్వంతో పాటు ఆట కూడా మెరుగుపడాల్సిన అవసరముందని శాంటో పేర్కొన్నాడు.