గబ్బాలో భారత్ విజయ ఆశలు ఆస్ట్రేలియన్ స్టార్‌ను కట్టడిపై ఆధారపడి ఉన్నాయా?

ఆడిలైడ్ టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసిన ఆస్ట్రేలియా గబ్బా వేదికగా జరిగే మూడో టెస్టు కోసం సిద్ధమైంది. కంచుకోటలాంటిదని భావించే ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా తన తుది జట్టును ప్రకటించింది. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన జోష్ హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్ సాధించి తిరిగి జట్టులోకి వచ్చాడు. రెండో టెస్టులో అతడి స్థానంలో ఆడిన స్కాట్ బోలాండ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ఆస్ట్రేలియా జట్టులో మరో మార్పు లేకుండా ఆడిలైడ్ జట్టుతోనే గబ్బా బరిలో దిగుతోంది. స్టీవ్ స్మిత్‌కు మరో అవకాశం ఇచ్చిన ఆస్ట్రేలియా, అతడి బ్యాటింగ్‌పై ఆశలు పెట్టుకుంది. కాగా, భారత జట్టు విఫలమైన బ్యాటింగ్ ప్రదర్శనను మెరుగుపరచుకుని విజయం సాధించేందుకు బ్యాటింగ్ ఆర్డర్ లో కీలక మార్పులు చేయవచ్చు.

భారత్ ప్రదర్శన:
ఇప్పటి వరకు సిరీస్‌లో ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్ ఓడిపోయిన భారత్, గబ్బా టెస్టులో విజయంతో ఆధిక్యంలో నిలవాలని భావిస్తోంది. నెట్స్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా సాధన చేశారు. మొదటి రెండు టెస్టుల్లో బ్యాటర్ల వైఫల్యం భారత్‌ను ఇబ్బందుల పాలుచేసింది. మూడో టెస్టులో రోహిత్ శర్మ ఓపెనింగ్‌కు వస్తే, బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్ తుది జట్టులో చోటు సంపాదించే అవకాశం ఉంది.

ట్రావిస్ హెడ్ భయం:
భారత్‌కు ప్రధాన సవాలుగా మారిన ట్రావిస్ హెడ్ గబ్బాలో మరోసారి చెలరేగుతాడా? లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2023 నుంచి భారత్‌తో మ్యాచ్‌లలో అత్యధిక 1052 పరుగులు చేసిన హెడ్, తన ఫామ్‌ను కొనసాగిస్తాడా అనేది భారత విజయానికి కీలకం. అయితే, గబ్బాలో గత మూడు ఇన్నింగ్స్‌లలో హెడ్ గోల్డెన్ డక్ అవ్వడం గమనార్హం. ఈ సారి అతడు తన రికార్డు తిరగరాస్తాడా? లేదా భారత బౌలర్లు అతడిని కట్టడి చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

మూడో టెస్టు:
గబ్బా వేదికగా శనివారం ఉదయం 5.50 గంటలకు మూడో టెస్టు ప్రారంభం కానుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమానంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచే జట్టు సిరీస్‌లో ఆధిక్యంలో నిలుస్తుంది.