తెలంగాణ ఐటీ రంగాన్ని మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం, అనేక కీలక అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌లోని నాదెళ్ల నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, ఆయన వెంట సీఎస్ శాంతికుమారి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ప్రతిపాదనలపై దృష్టి సారించారు. స్కిల్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం, ఏఐ సిటీలో ఆర్ అండ్ డీ కేంద్రాల ఏర్పాటుపై ముఖ్యంగా చర్చించారు. క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని సీఎం నాదెళ్లను అభ్యర్థించారు.
సీఎం రేవంత్ రెడ్డి, “యువతకు నైపుణ్యాల ద్వారా ఉపాధి అవకాశాలు అందించడమే మా లక్ష్యం. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు భాగస్వామ్యంగా ఉంటే ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం,” అని చెప్పారు. సత్య నాదెళ్ల కూడా స్కిల్ యూనివర్సిటీ ప్రతిపాదనను ప్రశంసించారు.
ముఖ్యంగా తెలంగాణలో నాలుగు డేటా సెంటర్ల ఏర్పాటు, హైదరాబాద్ కేంద్రంగా మైక్రోసాఫ్ట్ విస్తరణపై చర్చ జరిగింది. ఇటీవలే మైక్రోసాఫ్ట్ సెంటర్‌లో సుమారు 4,000 ఉద్యోగాలు కల్పించే ఒప్పందం జరిగిందని, ఆ పనుల పురోగతిపైనా సవివర చర్చలు జరిగాయి.
తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపడుతున్నారు. ఐటీ రంగంలో తెలంగాణ ముందుకు దూసుకుపోతున్న నేపథ్యంలో, గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వంటి సంస్థలు రాష్ట్రానికి ప్రాధాన్యం పెంచుతున్నాయి. ప్రపంచ స్థాయి కంపెనీల భాగస్వామ్యంతో తెలంగాణ ఐటీ రంగంలో మరో మెరుగైన శకానికి నాంది పలుకుతోంది.