జిల్లా, మండల పరిషత్ లకు నిధుల కేటాయింపు, విధుల అప్పగింత: సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Review Meeting, CM KCR Review Meeting On Strengthen Local Bodies, Mango News, Measures to be Taken to Strengthen Local Bodies, Strengthen Local Bodies, Telangana CM KCR, Telangana Gram Panchayat, Telangana Gram Panchayats Development, Telangana News, Telangana Political Updates

రాష్ట్రంలో స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఇస్తున్న మాదిరిగానే జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు కూడా నిధులు కేటాయిస్తామని, నిర్ధిష్టమైన విధులు అప్పగిస్తామని వెల్లడించారు. 2021-22 బడ్జెట్లోనే జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. మండల, జిల్లా స్థాయి అధికారుల అనుమతులు అవసరం లేకుండానే, గ్రామ పంచాయతీలు తమ నిధులను సంపూర్ణంగా వినియోగించుకునే అధికారం కొత్త పంచాయతీ రాజ్ చట్టం కల్పించిందని, దీన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.

జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తాం:

‘‘స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుని, అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం నిధులను నేరుగా మంజూరు చేస్తున్నది. గ్రామ పంచాయతీలకు నెలకు రూ.308 కోట్ల చొప్పున, మున్సిపాలిటీలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నది. నిధుల కొరత లేకపోవడంతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ట్రాక్టర్లు, డంపుయార్డులు, నర్సరీలు, వైకుంఠధామాలు సమకూరాయి. ఇదే తరహాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తాం. ఈ నిధులను నరేగా లాంటి పథకాలతో అనుసంధానం చేసుకోవడం వల్ల మరిన్ని నిధులు సమకూరే అవకాశం ఉంటుంది. నిధులు ఇవ్వడంతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్తులకు నిర్దిష్టమైన విధులు అప్పగించాలి. జిల్లా, మండల పరిషత్ లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలో అధికారులు సూచించాలి. ఆ సూచనలపై జిల్లా పరిషత్ చైర్ పర్సన్లతో నేనే స్వయంగా చర్చిస్తా. అనంతరం తుది నిర్ణయం తీసుకుంటాం. మొత్తంగా జిల్లా, మండల పరిషత్ లను మరింత క్రియాశీలం చేసి, గ్రామీణాభివృద్ది కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం, గౌరవం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

గ్రామ పంచాయతీలకు తమ నిధులను సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు:

‘‘గ్రామ పంచాయతీలు తమ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా కొత్త చట్టంలో నిబంధన పెట్టాం. కానీ కొన్ని చోట్ల రెండు లక్షల రూపాయలకు మించిన పనుల మంజూరుకు మండల అధికారుల నుంచి అనుమతి పొందాలనే పాత నిబంధన అమలు చేస్తున్నారు. ఇది కొత్త చట్టానికి విరుద్ధం. గ్రామ పంచాయతీలు తమ నిధులను, తమ గ్రామ అవసరాలు తీర్చడానికి సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు ఉన్నది. ఎవరి జోక్యం అక్కరలేదు. ఈ విషయంలో అధికారులు మరోసారి స్పష్టత ఇవ్వాలి’’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, కమిషనర్ రఘునందన్ రావు, డిప్యూటీ కమిషనర్ రామారావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రభుత్వ విప్ లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, శంకర్ నాయక్, హర్షవర్థన్ రెడ్డి, ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 3 =