తెలంగాణలో మరో కొత్త పెట్టుబడి సంస్థ ప్రవేశించేందుకు సిద్ధమైంది. అంబర్-రెసోజెట్ భాగస్వామ్య సంస్థ, పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువులు, విడి భాగాలు అందిస్తూ, రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడితో ఉత్పాదన ప్లాంట్లను స్థాపించడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థ నూతన ప్లాంట్లు నిర్మించి, తక్షణమే వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలను సృష్టించనుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
సోమవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో, అంబర్-రెసోజెట్ సంస్థ తమ పెట్టుబడుల ప్రణాళికను వెల్లడించింది. ఈ సందర్భంగా, ఆ సంస్థకు ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలను అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అంబర్-రెసోజెట్ సంస్థ దేశంలోని వివిధ కంపెనీల కోసం రూమ్ ఏసీలు, అత్యాధునిక వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, పారిశ్రామిక ఎయిర్ కండిషనర్లు వంటి పరికరాలను తయారుచేసి అందిస్తోంది.
ఈ పెట్టుబడితో, వచ్చే మూడేళ్లలో రూ.250 కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేయబడతాయని, తద్వారా 1,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని మంత్రి వివరించారు. త్వరలోనే అధిక నాణ్యత కలిగిన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (PCBs) ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. వందేభారత్ రైళ్లు, మెట్రో రైళ్ల ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, బస్సులు, డిఫెన్స్ వాహనాలు మరియు పారిశ్రామిక అవసరాలకు ఎయిర్ కండిషనర్లు తయారు చేసే అంబర్ సంస్థకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది.
హైదరాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకున్న అంబర్ సంస్థకు అభినందనలు తెలుపుతూ, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ డా. ఇ. విష్ణువర్ధన్ రెడ్డి, సిఇఓ మధుసూదన్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ డా. ఎస్ కె శర్మ, అంబర్-రెసోజెట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.