తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంపై కూడా పడింది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని 4వ ఫ్లోర్ లోని పనిచేసే ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. దీంతో సంబంధిత అధికారులు అప్రమత్తమై 4 వ ఫ్లోర్ లో శానిటైజేషన్ పక్రియను చేపడుతున్నారు. దాదాపుగా 1500 వందల మంది ఉద్యోగులు ఈ హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. ఉద్యోగికి కరోనా నిర్ధారణ అవ్వడంతో 4వ ఫ్లోర్ లో పనిచేసే ఉద్యోగులందరిని అధికారులు ఇళ్ళకు పంపించి, శానిటైజేషన్ చర్యలు ప్రారంభించారు.
మరోవైపు కొత్తగా నమోదైన 154 కేసులతో కలిపి, జూన్ 7, ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3202 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 137 కి చేరినట్టు తెలిపారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 448 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఈ 448 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 3,650 కి చేరింది. ఈ వైరస్ నుంచి కోలుకుని 1742 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం 1771 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu