తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతొ విద్యాశాఖ అలర్ట్ అయింది. గ్రేటర్‌తో రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలలకు డీఈవో సెలవు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావం బీభత్సంగానే ఉంది. పరిస్థితిని బట్టి స్కూళ్ల యాజమాన్యాలు సెలవు ప్రకటించాలని డీఈవో.. ఎంఈవోలకు పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో నిన్నటి నుంచి వర్షం దంచికొడుతునే ఉంది. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సనత్ నగర్ నుంచి ఓ వ్యక్తి మృతదేహం వర్షంలో కొట్టుకుపోయి.. పార్శీగుట్ట దగ్గర కనిపించింది. ఆ వ్యక్తిని పార్శీగుట్టకు చెందిన అనీల్‌గా గుర్తించారు. పంజాగుట్ట, సుఖనివాస్ అపార్ట్‌మెంట్‌పై పిడుగుపండిది. అలాగే మరో చోట షెడ్డుపై పిడుగు పడి కారు కాలిపోయింది.
వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో భాగ్యనగరం అంధకారంలో నెలకొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరించింది. ఈరోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. దాంతో అప్రమత్తమైన GHMC, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను కోరింది. ఉదయం అమీర్ పేట, పంజాగుట్ట, ఫిల్మ్ నగర్, మలక్ పేట, ఖైరతాబాద్, నాగారం, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, కూకట్ పల్లి, ఎస్‌ఆర్ నగర్‌లో భారీ వర్షం కురిసింది.
జీహెచ్ఎంసీలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలతో నిన్నటి నుంచే అప్రమత్తంగా ఉన్న GHMC అధికారులు.. ఎక్కడికక్కడ నీరు తొలగిపోయేలా మాగ్జిమం ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ చాలా కాలనీల్లో నీరు 3 అడుగుల దాకా ఉంది. చాలా రోడ్లపై కూడా నీరు ప్రవహిస్తోంది. నాలాల నుంచి కూడా నీరు బయటకు వచ్చేస్తోంది. ఏదైనా సహాయం కావాల్సి వస్తే ప్రజలు GHMC టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చెయ్యాలని కోరారు.