కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సిద్దమైన బీఆర్ఎస్

BRS Is Ready To Fight Against The Congress Government Demanding Loan Waiver

కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమయింది బీఆర్ఎస్ పార్టీ. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో రైతులతో,  బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేడు ధర్నాలు చేయనున్నారు. ధర్నాకి వెళ్లే ముందు నిన్న ముఖ్యమంత్రి తెలంగాణ తల్లిని ఉద్దేశించి మాట్లాడిన చిల్లర మాటలకు నిరసనగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నిరసనలో కూర్చోవాలని పిలుపునిచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ చేస్తున్న రుణమాఫీ బూటకం, పచ్చి దగా, పచ్చి మోసం అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ముఖ్యమంత్రి బండారం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బట్ట బయలైందన్నారు.

కాంగ్రెస్ డ్రామాలు ఇక నడవవు. రుణమాఫీ పూర్తిగా ఎప్పుడు చేస్తారో చెప్పాలి. రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వానికి క్లారిటీ ఉందా? మొత్తంగా వీళ్లందరి మాటలు వింటే జరిగింది పావు శాతం రుణమాఫీ కూడా లేదని తేలిపోయింది. వ్యవసాయ శాఖ మంత్రి ఏమో రూ. 2 లక్షలు మాఫీ చేశాం అంటూ ప్రకటన చేశారు. కానీ కొన్ని పత్రికలు రుణం పూర్తిగా మాఫీ కాలేదంటూ వార్తలు రాశాయి. జరిగింది రుణమాఫీ కాదు… పెట్టింది రైతులకు టోపీ అని సెటైర్లు వేశారు. ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు బ్యాంకులను ముట్టడిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. రైతులకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెప్పుకుంది కానీ జరిగింది మోసం. రుణమాఫీ జరగలేదు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫాంహౌస్ నాది కానే కాదు
అటు జన్వాడ ఫాంహౌస్ నాది కానే కాదు…తప్పుంటే కూల్చేయండి అంటూ బీఆర్ఎస్‌ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్వాడ ఫాంహౌస్ కూల్చేస్తారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్వాడ ఫాంహౌస్ తనది కాదని.. తనకంటూ ఎలాంటి ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. ఆ ఫామ్ హౌస్ ను తాను లీజుకు మాత్రం తీసుకున్నానని వివరించారు. నిబంధనలు ఉల్లంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్ ను నిర్మించి ఉంటే తానే దగ్గర ఉండి కూల్చివేయిస్తానని కేటీఆర్ చెప్పారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పలువురు కాంగ్రెస్ మంత్రులతో పాటు పెద్ద నాయకుల ఫామ్ హౌస్ లను కూడా కూడా పరిశీలించాలని వ్యాఖ్యానించారు.