బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని గత కొన్ని నెలలుగా విసృతంగా ప్రచారం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. దీనిపై ఇరు పార్టీల నాయకులు పరస్పరం చేసుకుంటున్న విమర్శలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో విలీనమవుతందంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక పార్టీలో బీఆర్ఎస్ విలీనం అంటూ దుష్ప్రచారం చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. అలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్స్ వేదికగా హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని, లేదంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం మీడియా సృష్టే అని అన్నారు కేంద్ర హో సహాయ మంత్రి బండి సంజయ్. ఇప్పటివరకు అలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో మీటింగ్ పెట్టుకున్నారేమో.. బీఆర్ఎస్ అంటే బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి అని అభివర్ణించారు. బీఆర్ఎస్ ఒక ఔట్ డేటెడ్ పార్టీ అని విమర్శించారు. వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాదుకునేందుకు అలా మాట్లాడుతున్నారని అన్నారు. వాళ్ళు ఢిల్లీ వచ్చేది కవితను కలిసేందుకు మాత్రమే అని తెలిపారు. బెయిల్ ప్రభుత్వం చేతిలో ఉంటే లా ఎందుకు? కోర్టు ఎందుకు? అని సీరియస్ అయ్యారు. కేసీఆర్‌ను లోపల వేయకుంటే కాంగ్రెస్‌కు గడ్డు కాలం తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లోపల వేస్తారని ప్రజలు అనుకుంటున్నారు. ఒక నెల కావచ్చు. 3 నెలలు కావచ్చు. ఏడాది కావచ్చు.. అలా జరగకుంటే అప్పుడు ఆ రెండు పార్టీలు ఒక్కటే అని అర్ధమవుతుందని అన్నారు.
బండి కామెంట్స్ పై బీఆర్ఎస్ లీడర్ రావుల శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అన్న బండి వ్యాఖ్యలకు శ్రీధర్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా బండి సంజయ్ ఎవరి చేతిలో ఓడిపోయారు? అని ప్రశ్నించారు. ‘బండి సంజయ్‌కు దమ్ముంటే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో పది శాతం సర్పంచులు, పంచాయతీ ఎన్నికలల్లో పది శాతం ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ సీటు గెలిపించాలి. కిషన్‌రెడ్డిని కూడా అడుగుతున్నా. దమ్ముంటే తన సొంత గ్రామంలో బీజేపీ అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిపించాలి’ అని సవాల్ విసిరారు. బండి సంజయ్ ఇసుమంత అవగాహన లేకుండా, తెలివితక్కువతనంతో ఎలా మాట్లాడుతారని విమర్శించారు. కేటీఆర్ ఏం తప్పు చేశారని జైల్లో పెడతారని నిలదీశారు. ఎంపీగా మసీదులు తవ్వాలె.. శవాలు తవ్వాలె.. లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పోనీలే అని అనుకున్నామని, కేంద్ర మంత్రి హోదాలోనైనా బుద్ధి తెచ్చుకొని జ్ఞానంతో మాట్లాడాలని చురక అంటించారు. లేకపోతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించాల్సిన అవసరం వస్తుందని ఎద్దేవా చేశారు. కాగా మరో బీఆర్ఎస్ లీడర్ బండి సంజయ్ రేవంత్ రెడ్డి కోవర్టు అంటూ విమర్శలు చేశాడు. ఇలా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ సాగిన వార్తలు బండి సంజయ్ దగ్గర యూటర్న్ తీసుకున్నాయి.