భారీ వర్షాలు, వరదలతో ఏర్పడిన నష్టాన్ని పరిశీలిచేందుకు రెండు రోజుల పర్యటనకు కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ముంపుకు గురైన కాలనీలను, ఇళ్లను, దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, చెరువులను, రోడ్లు, చెరువుల పునరుద్దరణకు చేపట్టిన మరమ్మతు పనులను కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ట నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ఇంటర్ మినిస్టేరియల్ అధికారుల బృందంలో నగరంలో ముగ్గురు సభ్యులు పర్యటించారు. మిగిలిన ఇద్దరు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం సెక్రటేరియట్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. భారీ వర్షాలు, వరదల వలన ఏర్పడిన నష్టాల గురించి కేంద్ర బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. వరద నష్టాలపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబీషన్‌ను కేంద్ర బృందం పరిశీలించింది.
పాతబస్తీలో కేంద్ర బృందం పర్యటన:
అనంతరం చాంద్రాయణగుట్ట, ఫలక్‌నూమా వద్ద దెబ్బతిన్న ఆర్.ఓ.బి ని, ముంపుకు గురైన ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధిత ప్రజలతో కేంద్ర బృందం సభ్యులు మాట్లాడారు. ఆర్.ఓ.బి కి రెండు వైపుల చేపట్టిన పునరుద్దరణ, నాలా నుండి తొలగిస్తున్న పూడిక తీత పనులను పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలతో తమ ఇళ్ల గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్తులోకి కూడా నీళ్లు వచ్చినట్లు ఈ ప్రాంత ప్రజలు కేంద్ర కమిటికి వివరించారు. ఇప్పటికి రోడ్లపై, ఇళ్లలోనూ నీళ్లు పేరుకుపోయి ఉన్నట్లు తెలిపారు. 10 రోజుల పాటు నీళ్లలో నానడం పట్ల తమ ఇళ్ల గోడలు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్ లు మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం ఫలక్‌నూమా ఆర్.ఓ.బి ని నిర్మించినట్లు తెలిపారు. ఈ ఆర్.ఓ.బి వలన ఇన్నర్ రింగ్‌రోడ్డు, చార్మినార్ ప్రాంతాలకు రోడ్డు సదుపాయం అనుసంధానం అయినట్లు తెలిపారు. అదేవిధంగా పల్లె చెరువు నుండి వచ్చే వరద నీటి నాలా 7 మీటర్ల వెడల్పు ఉంటుందని, ఈ నాలా ఆర్.ఓ.బి కింద నుండి వెళ్తుందని తెలిపారు. పల్లెచెరువు తెగిపోవడం వలన వచ్చిన వరదతో ఈ ప్రాంతానికి అపార నష్టం జరిగినట్లు తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్.ఓ.బి రిటైనింగ్ వాల్వ్ దెబ్బతిన్నదని, అదేవిధంగా అనేక కాలనీలు వరద ముంపుకు గురైనట్లు తెలిపారు. రోడ్లపై 5 మీటర్ల ఎత్తున వరద నీరు నిలిచినట్లు కేంద్ర బృందానికి వివరించారు.
అనంతరం ఈ పర్యటనలో భాగంగా కందికల్ గేట్ వద్ద ఉన్న నాలా పునరుద్దరణ పనులను కేంద్ర బృందం పరిశీలించింది. చాంద్రాయణగుట్ట పూల్‌బాగ్‌లోని వరద ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడింది. ఈ సందర్భంగా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసి కేంద్ర బృందాన్నీ కలిసి వరదలతో జరిగిన నష్టాన్ని గురించి వివరించారు. దాదాపు 10 అడుగులకు పైగా రోడ్లు, ఇళ్లు వరదముంపుకు గురయ్యాయని, ప్రజలు తీవ్రంగా నష్టపోయినందున కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాలాపూర్, హఫీజ్ బాబానగర్, గుర్రం చెరువు, అప్పా చెరువు, గగన్ పహాడ్ వద్ద అప్పా చెరువు నాలా సహా తదితర ప్రాంతాలను కేంద్రబృందం సందర్శించి వరద ప్రభావాన్ని పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu